#


Index

భక్తి యోగము

పరమాత్మ తాలూకు విభూతే గనుక తాత్కాలికంగా సాధకుడైన వాడు దీన్ని పట్టుకొని పోతే దాని మూలస్థానమైన పరమాత్మనే చేరుస్తుంది కాబట్టి ఒక ఆలంబనంగా సిఫారసు చేస్తుంది మనకదే భగవద్గీత. ఈ ఆలంబనం ద్వారా ఆ సత్యాన్ని అందుకొంటే ఇది కూడా సాధకుని బుద్ధి వృత్తితో పాటు సత్యంలోనే లయమయి పోతుంది. కాబట్టి అసలు దానికి నష్టం లేదు. మన సాధన మార్గానికీ ఇబ్బంది లేదు. కాళిదాస మహాకవి చెప్పినట్టు నదీ ముఖేనేవ సముద్ర మా విశత్తనే భావం లాంటిదిది. నదీ ప్రవాహంలోబడి పోతే అదే చేరుస్తుం దెప్పటికైనా మహాసాగరాన్ని. అక్కడి నుంచి వచ్చిందే అక్కడికి తీసుకెళ్లుతుందని సిద్ధాంతం. సముద్ర జలాన్ని తన కిరణాలతో పీల్చి సూర్యభగవానుడు మేఘరూపంగా మారి వర్షిస్తే ఆ జలం పర్వత శిఖరాల మీది నుంచి నదీ మతల్లిగా ప్రవహించి ఆ నది మరలా సముద్రాన్నే చేరుతున్నది. ఛాందోగ్యం చెప్పిన ఈ మాట చూడండి నేటి శాస్త్ర విజ్ఞానాని కెంత అతికినట్టున్నదో. కాబట్టి భగవత్స్వరూపంలో నుంచే వచ్చింది మానవుని బుద్ధి వృత్తి. స్వరూపం నుంచి విభక్తమయి వచ్చిన ఈ వృత్తి మరలా అవిభక్తంగా దాన్ని చేరే వరకూ ప్రయాణం సాగవలసిందే. అందులో విభక్తిగా విడిబడి వచ్చింది. దానితో ముడిబడటానికి మరలా భక్తిగా ప్రసరిస్తున్నది. అది సగుణ భావంతో సాగినా దాన్ని దర్శించే సరికది నిర్గుణంగా మారవలసిందే తప్పదు.

Page 486

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు