#


Index

భక్తి యోగము

ఆయన రూపంగా ధ్యానం చేస్తుంటారో అలాటి సగుణ భక్తులా. లేక యేచాప్యక్షర మవ్యక్తమ్. ధన దారపుత్రుల మీద ఏషణ లన్నీ పరిత్యజించి నామరూపాలనే ఉపాధులేవీ లేని అక్షరమూ అవ్యక్తమూ అయిన పరమాత్మనే తమ ఆత్మ స్వరూపంగా భావించే నిర్గుణోపాసకులైన జ్ఞానులా. తేషాంకే యోగ నిత్తమాః - ఎవరీ ఇద్దరిలో యోగవిత్తములని ప్రశ్నిస్తున్నా డాయన గారి నర్జునుడు.

  సాంఖ్యయోగం దగ్గరి నుంచీ విశ్వరూపాధ్యాయం వరకూ భగవత్స్వరూపాన్ని ఎంత వర్ణించిందో గీత ఆ తత్త్వాన్ని అందుకొనే సాధన మార్గాన్ని కూడా అంతగానే సూచిస్తూ వచ్చింది. దానికే భక్తి అని ఉపాసన అని పేరు పెడుతున్నది గీత. కాని అది ఒకటిగాదా భక్తి. రెండు విధాలుగా వర్ణించింది. పోనీ రెండూ సజాతీయమా అని చూస్తే అలా చెప్పదు. చెప్పకపోగా ఒకదాని కొకటి విరుద్ధ మన్నట్టుగా పేర్కొంటుంది. చూడండి. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః - బుద్ధిలేని మానవులు నన్ను అవ్యక్తమని చూడక వ్యక్తమైన రూపంగా భావిస్తున్నారు. పరం భావ మజానంతః వ్యక్తమైన ఈ రూపమే నేను కాను. అసలు నా స్వరూపం వేరే ఉంది. ఇది అపరమైతే అది పరం. పరమైన నా అసలు రూపమెవరికీ అర్థం కావటం లేదు. అది నామరూపాత్మకం కాదు. కనుక అవ్యయం. మార్పు లేనిది. అనుత్తమం. అన్నిటికన్నా అతీతమైనది. విలక్షణమైనది.

Page 482

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు