నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా
శక్య ఏవం విధో ద్రష్టుం - దృష్ట వానసి మాం యధా - 53
భక్త్యాత్వ నన్యయా శక్య - అహ మేవం విధో ర్జున
జ్ఞాతుం ద్రష్టుంచ తత్త్వేన ప్రవేష్టుంచ పరంతప - 54
ఇది ఒక్కటే సాధనం గాని మరేదీ లేదు సుమా. జ్ఞానా దేవతు కైవల్యం. సామాన్యకారమైన జ్ఞానమొక్కటే దర్శనోపాయం. అది తప్ప విడిచి నాహం వేదైర్నతపసా నాలుగు వేదాలూ ఏకరువు పెట్టినా నన్ను చూడలేవు. చాంద్రాయణాది తపోదీక్షతో చూడలేవు. గోభూహిరణ్యాదులు దానం చేసినా ప్రయోజనం లేదు. ఇజ్యయా. యజ్ఞాలతో పూజలతో పుణ్యకార్యాలతో సాధించలేవు. వాటికి మరేదైనా ఫలితముందేమో గాని మాంద్రష్టుం పరతత్త్వాన్ని దర్శించట మనే మహాఫలం మాత్రమందించే సామర్థ్యం వాటికి లేదు. దృష్ట వానసి - నీవైనా చూచావంటే నీ ప్రయత్నంతో గాదు. నా ప్రసాదంతో. స్వప్రయత్నంతో చూడకుంటే అదీ ఆభాసే. నీకు తృప్తి నివ్వదు.
మరి ఎప్పుడైతే తృప్తి నిస్తుందని అడుగుతావా. వస్తువును పట్టుకొని చూస్తేనే. అప్పుడధిష్ఠాన జ్ఞానముంటుంది నీకు. ఆ జ్ఞానంతో చూస్తే ఇది కూడా నీకు అసత్యంగా కాక సత్యమైన నీ స్వరూపంగానే అనుభవానికి రాగలదు. ఆ దృష్టికే అనన్యమైన భక్తి అని పేరు. అనన్యమైన భక్తి జ్ఞానమే. జ్ఞానోదయానికి పూర్వమది సగుణ భక్తి. జ్ఞానోదయమైతే అది నిర్గుణ భక్తి.
Page 472