ఎదుట చూస్తున్న ఆ ఈశ్వరుడే కృష్ణుడనుకో. ఇప్పుడీ విశ్వాన్ని చూచి చూచి విసుగుపుట్టి దీనికన్నా విలక్షణమైన మరొక విశ్వమేదో ఉంది దాన్ని వాడు చూపితే చూడాలనుకొన్నాడీ మానవుడు. అలా చూపే సామర్థ్యమున్న వాడే గదా ఈశ్వరుడు చూపగలడని భావించి అడిగాడు. అడిగితే చూపకపోవట మేమిటని చూపాడా ఈశ్వరుడు. చూపాడా వట్టిది. మరొక విశ్వమంటూ ఏదైనా ఉంటేగా చూపటానికి. విశ్వమనేది క్రొత్తగా ఎక్కడా లేదు. ఎక్కడి నుంచీ తెచ్చి చూపనక్కర లేదు. ఇప్పుడు మనమంతా నిత్యమూ చూస్తున్న ఈ చరాచర ప్రపంచమే విశ్వం. ఇది విశ్వేశ్వరుడి రూపమే మరేదీ గాదు. ఆ విశ్వేశ్వరుడు నీ ఆత్మ స్వరూపమే. అయితే ఆ సంగతి మరచిపోయి దీన్ని చూస్తుండే సరికిది ఏదో కొత్తగా కనిపిస్తున్నది. శరీరం మేరకే పరిమితమైన సంకుచిత దృష్టితో చూస్తున్నాము కాబట్టి చాలా అపూర్వంగా అద్భుతంగా దర్శనమిస్తున్నది. అయితే మిగతా పశుపక్ష్యాదులకు లేని వివేక జ్ఞానముంది మనకు. అదే దైవదత్తమైన దివ్యదృష్టి మనకు. కాని అది మన అశ్రద్ధ వల్ల దివ్యంగా కాక మర్త్యంగా మారిపోయింది. అలాంటి మర్త్య దృష్టితో చూడబోయే సరికిదంతా భయానకంగా ఉద్వేజకంగా మారిపోయిందీ విశ్వరూపం. అర్థం చేసుకోకపోతే అంతే మరి. మన దృష్టిని బట్టి సృష్టి. అజ్ఞుడికి సృష్టి భయంకరం. అల్పజ్ఞుడికి కొంత భయంకరం. అధిక జ్ఞుడి కొక ఇంద్రజాలం లాగా వినోదకరం. విశ్వం విశ్వమే. అందులో ఎప్పుడూ మార్పులేదు. మనదృష్టి మారే కొద్దీ అది మారినట్టు కనిపిస్తుంది.
Page 465