#


Index

విశ్వరూప సందర్శన యోగము

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయా మాస భూయః
ఆశ్వాసయా మాస చ భీత మేనం
భూత్వా పునస్సౌమ్యపపు ర్మహాత్మా - 50



  ఇప్పుడు బయటపడ్డాడు వ్యాసభట్టారకుడు. విశ్వ రూప ముప సంహరించి తన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడని కంఠోక్తిగా చెబుతున్నాడు. అదీ సంజయుడి మాటల్లో. ఏమంటున్నాడు సంజయుడు. ఇత్యర్జునం వాసు దేవ స్తధోక్త్వా ఈ ప్రకారంగా వసుదేవుని కుమారుడైన కృష్ణుడు తధోక్త్వా. అలాగే నని హామీ ఇచ్చి అలాగేనంటే. నీవు కోరినట్టు నా పూర్వ రూపమే చూపుతాను బెంగ పెట్టుకోవద్దని అర్జునుడికి భయం తీర్చి. స్వకం రూపం దర్శయా మాస భూయః మరలా యధాపూర్వంగా తన సహజమైన రూపమేదుందో అదే దర్శయా మాస చూపాడట.

  అంతేకాదు. ఆశ్వాసయామాసచ భీత మేనం. అంతదాకా భయంతో వణికిపోతూనే ఉన్నాడుగా ఆమానవుడు. అంచేత భూత్వా పునస్సౌమ్య వపు ర్మహాత్మా. ఉగ్రమైన రూపానికి స్వస్తి చెప్పి మరలా సౌమ్యమైన రూపంలో సాక్షాత్కరిస్తూ ఆశ్వాసయా మాసచ. అతణ్ణి సాంత్వన వచనా లతో ఓదారుస్తూ వచ్చాడు. ఏమిటిదంతా. అంత వరకూ అదేదో భీకరమైన రూపం చూపి అతణ్ణి హడలగొట్టట మేమిటి. ఇప్పుడు కుయ్యో మొట్టో అని అతడు కేకలు పెడితే లేదులే పొమ్మని మరలా సౌమ్యమైన రూపంలో అతనికి కనపడటమేమిటి. ఏమిటంటే ఏమని చెబుతాం. ఇదంతా తన పాటికి తాను చేసి ఉంటే ఆయనిలా ఎందుకు చేశావని నిలదీయవచ్చు.

Page 463

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు