విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
దివ్యదృష్టి. మానవుడి కొక్కడికే ప్రసాదించాడది. పశుపక్ష్యాదులకు వేటికీ లేదు పాపం. మనకే ఆభాగ్యం. ఏమిటా జ్ఞానం మనకు ప్రసాదించింది. వివేక జ్ఞానం. కేవల వాసనా జ్ఞానంతోనే బ్రతుకుతున్నాయి పశుపక్ష్యాదులు. వాటికి వివేక జ్ఞానమనే దివ్యదృష్టి లేదు. మర్త్యమైన దృష్టే ఉంది వాటికి. కాగా మనకు మర్త్య దృష్టి దివ్య దృష్టి రెండూ ఉన్నాయి. ప్రపంచ మొకటి ఉందని తెలుసే గాని వాటికి - దాని అంతరార్థ మేమిటో తెలియదు. అన్న పానాలు సేవించటం వరకే పరిమిత మయిన జ్ఞానం వాటిది. తుదకు వస్త్రం కప్పుకోవాలనీ ఒక ఇల్లు కట్టుకొని అందులో కాపుర ముండాలనే చింత కూడా లేదు. అపురూపంగా వివేక జ్ఞానమనే దివ్యదృష్టి మనకొకరికే అబ్బింది. అబ్బింది గాని దాని విలువ గుర్తించక పోతే పనికి రాము మనం.
ఎప్పుడైతే పనికి వస్తాడీ మానవుడు. రెండు రహస్యాలు గుర్తిస్తే. మొదట మనం నరులం. పరిమిత జ్ఞానమే మనది. పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడైన నారాయణుడొకడున్నాడు. ఆయన వారసులమే మనం జ్ఞాన దృష్ట్యా చూస్తే. కృష్ణుడి కర్జునుడు సన్నిహితుడంటే ఇదే అర్థం. రెండవది ఆ నారాయణుడి విశ్వరూపం చూతామనే అభిలాష మనకే ఉంది. మిగతా తిర్యక్కు లేవీ అనుకోలేవు అభిలాషా లేదు వాటికి. దివ్య దృష్టి నివ్వ లేదు గదా వాటికి. అంటే వివేక జ్ఞానం లేదు గదా. విశ్వాన్ని చూచే వరకే గాని అందులో దాగి ఉన్న ఆంతర్యమేమి బోధ పడుతుంది వాటికి. మర్త్యమైన
Page 455