#


Index

విశ్వరూప సందర్శన యోగము

జ్ఞానిలాగా అభినయిస్తున్నాడే గాని అసలైన జ్ఞాని కాదనో. నన్ను ప్రశంసిస్తున్నాడే గాని అది కేవలం భయభ్రాంతితోనే గాని భక్తితో గాదనో. మొత్తం మీద ఏదైనా కావచ్చు. పలక లేదా మహానుభావుడు. ఇక ఈ అడ్డదారు లేవీ కాదని రాజమార్గంలోనే ప్రయత్నం సాగిస్తున్నాడాయన అనుగ్రహం కోసం. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేనచ ప్రవ్యధితం మనోమే. స్వామీ మీరు చూపిన విశ్వరూప మింతకు ముందు నేనెప్పుడూ చూచింది కాదు. అదృష్ట పూర్వం. అది చూచి నిజంగానే హృషితోస్మి. బ్రహ్మానందతుందిల మయింది నా మనస్సు. హర్షంతో పులకిత మయింది నా శరీరం. కాని నా మనసింకా ఒక పక్క భయంతో చిక్కుపడి కుంగిపోతున్నది. కుదుట పడటం లేదు. అంచేత నా మీద దయ ఉంచి ఈ రూప ముపసంహరించండి. ఇంక చూడలేను. మీరు నాకెంత దివ్యదృష్టి ఇచ్చి చూడమన్నా చూడలేను. నాతరం గాదు. తదేవ మే దర్శయ దేవరూపం. ఇంతకు ముందు నా కలవాటైన నీరూపమేదో దాన్నే అనుగ్రహించి నాకు చూపండి. దేవేశుడవు నీవు జగన్నివాసుడవు. అన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఏది చేయాలన్నా చేయగలవు. విశ్వరూపం చూపాలనుకొన్నావు. చూపావు. అలాగే మానాలనుకొంటే చూపకుండా మానగలవు. కాబట్టి చూపటమిక మానమని నా ప్రార్ధన.

  ఇది మాని మరి నీ వేది చూపమంటావని అడుగుతావా. చెప్పాను గదా నాకు మొదటినుంచీ పరిచితమైన నీ అసలు రూపమేదో దానినే చూపమని. అది ఎలా ఉంటుందో వర్ణిస్తున్నా డిప్పుడర్జునుడు.

Page 450

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు