#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

ఎందుకా మాట అనవలసి వచ్చిందని అడుగుతాం. ఇదీ పరిస్థితి. దీనికిప్పుడు సమాధాన మిస్తున్నది గీత. వినండి. మమమాయా దురత్యయా. నా మాయను దాటిపోవట మసాధ్యం. అది గుణమయీ. గుణాలతో నిండి పోయింది. సత్త్వరజస్తమో గుణాలు మూడూ మూడని పేరేగాని ఒకదాని కొకటి చేరి ద్విగుణీకృతం త్రిగుణీకృతం శత గుణీకృతం సహస్ర - లక్ష కోటి గుణీకృతంగా మారిపోతాయి. గుణించటమంటే హెచ్చించటం పెంచుకొంటూ పోవట మనేగదా అర్థం. అలా పెంచుతూ పోతే ఎంత దూరమైనా పోతుంది. అర్బుదన్యర్బుదాలుగా అసంఖ్యాకంగా పెరిగిపోతాయి. గుణా గుణేషు వర్తంతే అని ఇంతకుముందే చెప్పింది గీత. పీచ్ దర్ పీచ్ అంటారు సూఫీలు. మడతలో మడత. ముడిలో ముడి. ఒకదానితో ఒకటి చుట్టుకొని పోయి చివరకు పీట ముడి పడుతుంది. దీనికే గ్రంథి అని పేరు పెట్టింది ఉపనిషత్తు. అది ఛేదించట మెంతైనా అసాధ్యం.

  అయితే అసాధ్యమేగాని Difficult అసంభవం కాదు. Impossible. సంభవమే. ఎలా చెప్పగలరు సంభవ మని. దైవీహ్యేషా. ఎంత గుణమయి అయినా భయం లేదు. అది ఎంత గుణమయో అంత దైవి. దేవుడికి సంబంధించిన దేదో అది దైవి. దీవ్యతీతి దేవః ఎవడు ప్రకాశిస్తుంటాడో వాడు దేవ. ప్రకాశమంటే ఇది స్వయం ప్రకాశం. ఒక్కటే ఉంటుందలాటి స్వయం ప్రకాశం. అది చైతన్య ప్రకాశం. సహజమైనదీ సార్వకాలికమైనదీ ఆ ప్రకాశం. దానితో అవినాభావంగా ఉన్న మాయా శక్తి కూడా దైవి.

Page 45

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు