#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

మోక్షానికి గాని దారితీసే ఏకైక సాధనం మానవుడికి వాడి బుద్ధే. అయితే అది మామూలుగా ఉన్నంతవరకూ పనికిరాదు. గుణాలు వాడికి దారి ఇవ్వవు. బలంగా పట్టుకొని సంసారంలోనే కట్టిపడేస్తాయి. బయటపడ నివ్వవు. అందుకే మోహితం నాభిజానాతి అని తెగేసి చెబుతున్నాడు భగవానుడు. నాభి జానాతి అంటే ఏమాత్రమూ గుర్తించ లేదట మానవుడి బుద్ధి. దేనిని. మామేభ్యః పరం గుణాల కతీతుడనైన నన్ను. అతీతుడైతే అవ్యయుడవుతాడు. వ్యయంలేని వాడవ్యయుడు. వ్యయమంటే జన్మాది సర్వభావ వికారాలని అర్ధం చెప్పారు భాష్యకారులు. యాస్కముని చెప్పిన షడ్భావ వికారాలు ఏవీ లేనివాడు కాబట్టి వ్యయం లేని వాడీశ్వరుడు. ముఖ్యంగా జనన మరణాలు లేవు. అలాంటి తత్త్వాన్ని జనన మరణాది సర్వ వికారాలతో సతమత మవుతున్న జీవుడెలా పట్టుకోవా లంటారు. అది సాధ్యమా. అందుకే నాభి జానాతి అని శాపం పెట్టాడు భగవానుడు.

దైవీ హ్యేషా గుణమయీ - మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే - 14


  అయితే ఇక ఈ మానవుడి గతి ఇంతేనా - వీడికెప్పటికీ తరణో పాయమనేది లేదా అని ప్రశ్న వచ్చిందిప్పుడు. ఉందని చెబుతాడా లేదని చెబుతాడా గీతాచార్యుడు. ఎలా చెప్పినా కష్టమే. లేదని చెప్పాడో అలాంటప్పు డెందుకీ గీతోపదేశ మెవడికిది అని అడుగుతాం. పోనీ ఉందని చెప్పాడా అయితే నాభి జానాతి ఏమాత్రమూ దాన్ని గ్రహించలేడని

Page 44

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు