#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

  మరి ఇప్పుడంతా త్రిగుణాత్మకమే అయినప్పుడు త్రిగుణాతీతమైన తత్త్వమిక ఏముందని ప్రశ్న. ఏముందని ప్రశ్నించ నక్కర లేదు. త్రిగుణాత్మిక అయిన మాయాశక్తి ఎవడి అధీనంలో ఉందని చెప్పామో వాడే గుణాతీతుడైన ఈశ్వరుడు. వాడి వల్లనే గుణా లేర్పడు తున్నాయని చెప్పినప్పుడు వాడు గుణాతీతుడని వేరే అడగ నక్కరలేదు. చెప్ప నక్కరలేదు. మామేభ్యః పర మవ్యయమనే మాటకిదే అర్ధం. ప్రకృతి గుణాలను అజమాయిషీ చేసే వాడు వాటికి పరంగానే ఉంటాడు. అయితే సృష్టి గుణాత్మకం. వాడు గుణాతీతం. అలాంటప్పుడు ఈ గుణాలు దాటి వాణ్ణి పట్టుకోట మెలాగ. ఎవడు పట్టుకోవాలి. మానవుడే గదా పట్టుకో వలసింది. ఎందుకని. మిగతా ప్రాణులకు వేటికీ లేని బుద్ధి బలం వీడికే ఉంది. బుద్ధి జీవులని పేరుగదా మానవులకు. ఆ బుద్ధితో త్రిగుణాల వల్ల ఏర్పడిన సంసార క్లేశమను భవిస్తున్నాడు వీడు. సమస్య ఎప్పు డనుభవిస్తున్నాడో అప్పుడు దానిని పరిష్కరించుకొనే ప్రయత్నం కూడా వీడిదే. అదే సంసార బంధం నుంచి మానవుడాసించే మోక్షం. కనుకనే మోహితం జగత్తంతా. మిగతా జడ జగత్తని గాదు. చేతన జగత్తు. జడానికి తాను మోహితమో కాదో కూడా తెలియదు. చేతనాలలో కూడా పశుపక్ష్యాదులకు వాసనా జ్ఞానమేగాని వివేచనా జ్ఞానం లేదు. అంచేత జగత్తంటే ఇక్కడ మానవజాతనే గ్రహించాలి మనం.

  మరి ఈ మానవుడికైనా గుణత్రయాన్ని దాటిపోయే అవకాశముందా. ఉంది. అదే బుద్ధి. మన ఏవ మనుష్యాణా మన్నట్టు బంధానికి గాని

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు