#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

సత్త్వోపాధి కాబట్టి అంతర్యామిగా ఎక్కడ ఏ పదార్ధంలో ఉన్నా గుణాలనే వశంలో ఉంచుకొన్నాడు కాబట్టి ఆ దశలోనూ బందీకాడు.

  మరి బందీ అయ్యేదెవ రంటారు. అదే చెబుతున్న దిప్పుడు గీత. త్రిభి ర్గుణమయై ర్భావైః ఏభిః సర్వమిదం జగ న్మోహితం. సత్త్వరజస్తమో గుణాలే త్రిగుణాలు, ప్రకృతి గుణాలివి. వీటితో నిండి నిబిడీకృతమయి ఉందీ మొత్తం ప్రపంచం. ఊరక ఉండటమే గాదు. మోహితమయి పోయింది. దిక్కు తెలియకుండా కండ్లు తిరిగి పడిపోయింది. మూర్ఛలో మునిగిపోయింది. అటు బ్రహ్మాండాన్నీ వ్యాపించాయీ గుణాలు. మన పిండాండాన్నీ వ్యాపించాయి. దేశకాల వస్తువులనే మూడు పరిచ్ఛేదాలతో Three dimensions కూడిందే గదా బ్రహ్మాండమంటే. అందులో దేశమంటే ఆకాశమంతా Space సత్త్వగుణం. కాలమంతా Time రజోగుణం. పోతే చరాచర పదార్ధాలన్నీ substance తమోగుణం. అలాగే పిండాండం దగ్గరికి రండి. మన మనస్సు సత్త్వగుణం. మన ప్రాణం రజోగుణం. పోతే మన ఈ శరీరం తమోగుణం. అలాగే మన అవస్థాత్రయం కూడా గుణత్రయాత్మకమే. జాగ్రత్తు సత్త్వమైతే స్వప్నం రజస్పైతే సుషుప్తి తమోమయం. ఇక త్రిగుణాల బంధం నుంచి తప్పించుకొని బయటపడ్డ పదార్ధమే ముంది సృష్టిలో. సృష్టి అంతా గుణమయమే. ఉపాదాన కారణం ప్రకృతే అయినప్పుడు దాని గుణాలు కార్య ప్రపంచంలోకి రాకుండా ఏమవుతాయి. కారణ గుణాః కార్యమను ప్రవిశంతి అని తార్కికులు చేసిన సిద్ధాంత మక్షరాలా సత్యం.

Page 42

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు