విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
విక్రమానికి పరిమితి లేదు. వీర్యం స్వరూపం. విక్రమం విభూతి. రెండూ హద్దు దాటినవే. హద్దు దాటితే రెండా అవి. కాదు. మరేమిటి. సర్వం సమాప్నోషి. సమ్యక్ ఏకేనాత్మనా వ్యాప్నోషి అని భాష్యం. ఒకే ఒక ఆత్మ తత్త్వంగా సమస్తాన్నీ వ్యాపించి ఉన్నావు. అందుకే సర్వః సర్వమూ నీకన్యంగా లేదు. అంతా నీకనన్యమే నని కీర్తిస్తున్నా డర్జునుడు.
స ఖేతి మత్వా ప్రసభం య దుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి
అజానతా మహి మానం తవేదం
మయా ప్రమాదా త్ప్రణయేన వాపి - 41
యచ్చావహా సార్ధ మసత్కృతోసి
విహార శయ్యాసన భోజనేషు
ఏకోధవా ప్యచ్యుత త్వత్సమక్షం
తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్ - 42
కీర్తించటమే గాదు. ఇంకా హడలిపోతూనే మాటాడుతున్నాడు. గద్గద స్వరమింకా వదల లేదు. భీతి ఇంకా విడిచిపోలేదు. ఏమి కారణం. ఉగ్రమైన ఆ విశ్వరూపమింకా ఉపశమించ లేదు. అలాగే ఎదట కనిపిస్తున్నదది. మహా అయితే విష్ణువు కాదది కృష్ణుడని కొంత అర్థం చేసుకొన్నాడు. కాని అది కూడా గట్టి పడలేదింకా మనసులో. అందుకోసమెందు కైనా మంచిదాయనను తనకు ప్రసన్నుణ్ణి చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలని
Page 443