#


Index

విశ్వరూప సందర్శన యోగము

పరమాత్మే నని అంతకన్నా వేరుగా జగత్తంటూ ఒకటి లేదనీ మనమర్ధం చేసుకోవలసిన సత్యం.

  అంతేకాదు త్వ మక్షరం సదసత్తత్పరం యత్. అక్షరం నీవు. క్షరం గాని స్వరూపం నీది. శుద్ధ చైతన్యం. నిరాకారం. వ్యాపకం. ఎలా నశిస్తుంది. సతసత్పర మది. ఉందంటే అది సత్. లేదంటే అది అసత్. పోతే పరమాత్మ సత్తు కాదు అసత్తు కాదు. ఉండటం లేకపోవటమనే భావాలు రెండూ ఆ స్వరూపానికి కేవల ముపాధులు. ఉపధానభూతే సద సతీ యస్యాక్షరస్య యుద్ద్వారేణ సదసతీ ఇత్యుపచర్యేతే అని ఒక అద్వైత రహస్యం వెలిబుచ్చారు భగవత్పాదులు. సదసత్తుల నేవి చైతన్యాని కుపాధులే గాక దానివల్లనే ఇది సత్తది అసత్తనే తేడాతో మనకు కనిపిస్తున్నాయట. అది నిజమే. అంతా ఒకే ఒక తత్త్వం పరుచుకొని ఉన్నప్పుడు సదసత్తులనే ద్వంద్వాలెక్కడ ఉండాలంటారు. వాటి కాధారం గాని ఆశ్రయం గాని ఏది. ఉన్న ఆ తత్త్వమే గదా. అది కూడా తత్త్వమేనని భావిస్తే విరుద్ధంగా కనపడవు. అందులోనే లయమయి పోతాయి. అలా భావించక అవేవో ఉన్నాయని చూస్తే మాత్రం ప్రత్యక్షమవుతాయి. ఇదే ఆ భాస లక్షణం. వస్తు దృష్ట్యా లేదు. తమ దృష్ట్యా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఆ భాసల స్వభావమే అలాంటిది. పోతే ఇవి వస్తువు మీద ఆధారపడి బ్రతకవలసిందే గాని వస్తువు మాత్రమలా పరాధీనమైనది కాదు. స్వతస్సిద్ధం. అందుకే సదసతోః పరం తదక్షరమని మరలా అర్థం వ్రాస్తున్నారు భాష్యకారులు.

Page 436

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు