విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఇతి. దానితో ఇరుపక్షాలకూ శాంతి అనేది అవశ్యంగా చేకూరుతుందని సంజయుడలా ద్రోణంచ భీష్మంచ అని వర్ణించటంలో అంతరార్థం. కాని తదపి నాశ్రాషీత్ ధృతరాష్ట్రః అది కూడా పెడచెవిన పెట్టాడు ధృతరాష్ట్రుడంటే ఏమనుకోవాలి మనం. భవితవ్యతా వశాత్. ఏమీ లేదు. అంతా ఈశ్వరేచ్ఛ. అది అలా విషాదాంతంగా ముగిసిపోవలసి ఉంది. అందుకే అలా విషాదాంత మయింది భారత యుద్ధమని వ్యాఖ్యానిస్తారు గురువుగారు.
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్య త్యను రజ్యతే చ
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమష్యంతి చ సిద్ధ సంఘాః - 36
నేను చూస్తూ వచ్చిందింత వరకూ భయంకరమైన విష్ణు స్వరూపం కాదు. మన కృష్ణ స్వామేనని ఎప్పుడు సవసవగా గుర్తించాడో అర్జును డప్పుడిక క్రమంగా ధైర్యం పుంజుకొంటూ మాటాడుతున్నా డాయనతో. ఒక విధంగా ఆయన నెందుకైనా మంచిదని తనకు మంచి చేసుకొంటున్నాడు. పొగడ్తల ద్వారా. స్థానే హృషీకేశ తవప్రకీర్త్యా - జగత్ప్ర హృష్య త్యనురజ్యతేచ. తానే గాదట. తన మాట అలా ఉంచి ఈ ప్రపంచ మంతా సంతోషిస్తుందట. ఎంతో అనురాగంతో కూడా కీర్తిస్తుందట ఆయన మాహాత్మ్యాన్ని మాటి మాటికీ. అది సహజమే సమంజసమే గదా అంటాడు. ఇంతమంది నిన్ను అలా కీర్తిస్తుంటే నేను నీవాడనయి ఉండి కీర్తించక ఎలా ఉండగలనని అర్జునుడి ఆంతర్యం.
Page 432