#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


  రాబోయే రణరంగంలో ఏయే యోధుల విషయంలో అర్జునుడికి విజయం సాధించగలమా అని సందేహముందో అది పోగొట్టి అతనికి ధైర్యమిచ్చే మాట కూడా అంటున్నాడు పరమాత్మ. ద్రోణంచ భీష్మంచ జయ ద్రధంచ కర్ణం - ధనుర్వేదాచార్యుడు ద్రోణుడంటే. దివ్యాస్త్ర సంపన్నుడు. విశేషించి తనకు గురుస్థానం. మరి భీష్ముడో. స్వచ్ఛంద మరణం తండ్రి వర ప్రసాదం వల్ల పొందినవాడు. దివ్యాస్త్ర సంపన్నుడు. పరశురామునంత వాడితో ద్వంద్వ యుద్ధం చేసినా పరాజితుడు కాలేడు. పోతే జయద్రధుడితడే సైంధవుడు. సింధు దేశాధిపతి. కౌరవులకు నూరుగురికీ బావ మరిది. ముఖ్యంగా తండ్రిగారి వరమొకటి ఉందతనికి. ఏమిటది. తన కుమారుడి శిరస్సు నెవడు నేల మీద పడగొడుతాడో వాడి శిరస్సు వెంటనే నేల రాలి వేయివక్క లవుతుందట. ఇక నాలుగవ వాడు కర్ణుడు. మహావీరుడు. వాసవదత్తమైన అమోఘమైన శక్తి ఒకటుందతని దగ్గర. సాక్షాత్తూ సూర్యభగవానుడి అంశలో కుంతీదేవికి కన్యాత్వ దశలోనే జన్మించి కానీనుడని పేరు తెచ్చుకొన్నవాడు. ఇలాటి మహాయోధుల విషయంలోనే నీకా శంక. వీరిని నేను జయించగలనా అని. అలాటి ఆశంక ఏదీ నీవు పెట్టుకో నక్కర లేదు. యుధ్యస్వ జేతాసి రణే. యుద్ధంలో తప్పకుండా జయించగలవు. మా వ్యధిష్ఠాః పరితపించ వద్దు నీ మనసులో. కారణమేమంటే మయా హతాం స్త్వం జహి. నేను ముందుగానే చంపేశాను వీరందరినీ. చచ్చిన వారినే నీవు మరలా చంపబోతున్నావంత మాత్రమే.

Page 428

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు