#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


  అలా వర్ణించటమే కాదు. అంత భీకరమైన విగ్రహాన్ని చూస్తే తట్టుకోగలడా. అందుకే గదా కాళ్ల బేరానికి వచ్చాడని ముందు పేర్కొన్నాము. నిజంగానే వచ్చాడిప్పుడా దీనమైన దశకు. ఆఖ్యాహిమే. నిజం చెప్పు స్వామీ నాకు. కో భవానుగ్రరూపో. ఇంత ఉగ్రమైన రూపంతోనా ఎదట నిలిచి కనిపిస్తున్నావు. ఎవడవు నీవసలు. కృష్ణుడవేనా. లేక విశ్వరూపుడవైన నారాయణుడవా. అదీగాక వేరొకడవా. కృష్ణుడవను కొందునా. నాకు మొదటి నుంచీ పరిచితమైన ఆమూర్తి ప్రస్తుతం కనిపించటం లేదు. లేక విశ్వరూపుడ వనుకొందునా. నీ విశ్వవ్యాప్తమైన రూపమే గోచరమవుతున్నది గాని దాన్ని చూపుతున్న నీ స్వరూపం దృగ్గోచరం కావటం లేదు. అలా కాక మరొక డెవడైనా నాముందు నిలుచున్నా డనుకొందువా. వాడెవడు. నీవేనా. నీవు కాదా. నీవు కాకుండా నీ విశ్వరూపానికి బాహ్యంగా ఎవడున్నాడు. ఉంటే నీవు విశ్వరూపుడవెలా కాగలవు. కాబట్టి ఎవడవో ఏమో తేల్చుకో లేక సతమత మవుతున్నాను. దయ ఉంచి నీ స్వరూపమేదో బయటపెట్టు. నమోస్తుతే. నీకొక నమస్కారం చేస్తాను. ప్రసీద నన్ను కరుణించు. విజ్ఞాతు మిచ్ఛామి భవంతం. నీ స్వరూపమేదో తెలుసుకోవాలని తాపత్రయ పడుతున్నాను. నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. నీవు చూపుతున్న ఈ లీల ఏమిటో నాకంతు పట్టటం లేదు. దయచేసి చెప్పమని బ్రతిమాలుతున్నాడు.

Page 422

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు