తత స్స విస్మయా విష్టో - హృష్ట రోమా ధనంజయః
ప్రణమ్య శిరసా దేవం - కృతాంజలి రభాషత - 14
మహర్షి ఇప్పుడు సాక్షాత్తుగా రంగంలో దిగుతున్నాడు. భగవానుడి విశ్వరూపాన్ని ఇక చిలువలు పలువలు పెట్టి బ్రహ్మాండంగా వర్ణిస్తాడు. అసలు బ్రహ్మాండ మంటున్నామే ఇదంతా ఏదోగాదు. విశ్వేశ్వరుడి విశ్వరూపమే. ఏమిటది. ఎలా ఉంది. అనేకమైన ముఖాలూ - అనేక నేత్రాలూ. అనేకమైన అద్భుత దర్శనాలూ. అనేకమైన దివ్యాలంకారాలూ. అనేక విధాలైన దివ్యాయుధాలూ పోతే దివ్యమైన పుష్పమాలలూ దివ్యాంబరాలూ - దివ్య గంధాను లేపనాలూ అనంతంగా సర్వతో ముఖంగా వ్యాపించిన రూపమది. ఏమి చెప్పమంటారు. దివి సూర్య సహస్రస్య. ఆకాశంలో ఒక్కసారిగా వేయి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుగు వస్తుందో అలాటి ప్రకాశం దానికి సాటి వస్తుందో రాదో చెప్పలేము. ఇంతకూ ఎక్కడ ఉందా దేదీప్యమానమైన ఆకారం. తత్రేకస్థం. చెప్పాడుగా ముందుగానే భగవానుడు ఏకస్థమయ్యే ఉందని. ఏకస్థం చేసే చూడమని. అలా ఏకస్థమైన ఆకృతే ప్రవిభక్త మనేకధా. నానా ముఖాలుగా విభక్తమయి దర్శనమిస్తున్నది. అపశ్యద్దేవ దేవస్య శరీరే. అలా ఇస్తుంటే చూస్తున్నా డర్జునుడా దేవ దేవుడి శరీరే. శరీరంలో. అప్పటికా శరీరమేదో గాదు. ఎక్కడో లేదు. ఆయన శరీరమే. ఆ శరీర మేకమే. అది బ్రహ్మాండమంతా వ్యాపించిన అశరీరమే మరలా. అలాటి శరీరంలో చూచాడు అర్జునుడాయన
Page 399