#


Index

విశ్వరూప సందర్శన యోగము

ఏకైకమైన ఈశ్వర చైతన్యం. అది ఎక్కడో గాదు. ఇహ ఇక్కడే. అంటే నీవు చూచే దృవ్య పదార్థాలన్నింటిలో అంతర్గతంగానే ఉందని అర్థం. అయితే ఎటు వచ్చీ ఇక్కడే అంతటా పరుచుకొని ఉన్న ఆ అధిష్ఠానాన్ని గుర్తించి దాని నేమరకుండా ఈ విశ్వరూప సందర్శనం చేస్తూ పోవాలి. అప్పుడే ఇది వాస్తవం గాక ఆభాసగా తోచి మనకు భయావహం కాకుండా వినోదప్రాయంగా మారి కనిపిస్తుంది. అందుకే ఈ జగత్తునంతా ఏకస్థం చేసి పశ్య చూడమని ఉపదేశిస్తున్నాడు. అంటే ఏకైకమైన ఆ స్వరూపంతో కలిపి పట్టుకోమని హెచ్చరిక. అలా పట్టుకోగలిగితేనే అతడు గుడాకేశుడు.

  గుడాకేశ అని అర్జునుణ్ణి సంబోధించటంలో ఇదే ధ్వనిస్తున్నది. సాభిప్రాయ మీ సంబోధన. ఇంతకు ముందు కూడా వచ్చిందిది ఒకచోట. అహమాత్మా గుడాకేశ అని వచ్చింది గదా. గుడాకా నిద్రా తస్యా ఈశన శీలః - నిద్రను జయించినవాడు. నిద్ర అంటే అజ్ఞానమని అర్థం చెప్పామా లేదా. ఇక్కడా అదే అర్థంలో ప్రయోగిస్తున్నాడీ శబ్దాన్ని వ్యాస భట్టారకుడు. నిద్ర అనేది అవిద్య. అది అమ్మవారి ఆవరణ శక్తి. ఆవరణమంటే కప్పి వేయటం. ఆధిష్ఠాన భూతమైన ఆ ఏకత్వాన్ని కప్పి పుచ్చి మనకు గుర్తు రాకుండా చేసేదే ఆవరణం. అది మానవుణ్ణి ఆవరించినంత వరకూ అధిష్ఠానం బదులు దానిమీద ఆధ్యారోపితమైన ప్రపంచమే కనిపిస్తుంది. అదే వాస్తవమయి దాని కాధారమైన ఆత్మచైతన్యమే అవాస్తవమనే భ్రమ

Page 391

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు