స్వప్నం వస్తుంది. అది నీవు చూస్తుంటావు. అందులో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. ఎందరినో కలుసుకొంటావు. అందరూ కలిసి ఏ హిమాలయాలకో పోయి అక్కడ ఎన్నెన్నో వింత వింత దృశ్యాలు చూస్తుంటారు. అయితే ఆ అనుభవం నీవరకే పరిమితం. నీవా స్వప్న జగత్తులో విహరిస్తున్నంత సేపూ అక్కడే ఉన్నారెంతో మంది నీ చుట్టూ. కాని వారెవరికీ లేదు ప్రవేశం నీ స్వప్న ప్రపంచంలో. కారణం వారికి నీ స్వప్న దృష్టి లేదు. జాగ్రదృష్టి మాత్రమే ఉంది. ఆ దృష్టితో నీ స్వప్నాన్ని వారు చూడలేదు. నీవు కూడా నీ స్వప్న జగత్తును చూస్తున్నంత సేపూ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని విస్మరిస్తావు. అంతే కాదు. చుట్టూ ఉన్న జగత్తును విస్మరించట మలా ఉంచి అసలా స్వప్న జగత్తును దర్శిస్తున్నప్పుడు కూడా అది నీ స్వరూపం మీదనే ఆధారపడి కనిపిస్తున్న దని గుర్తించలేక నిన్నే నీవు మరచిపోయి చూస్తుంటావు.
అలాగే ఇక్కడ దుర్యోధనాదులకూ భీష్మాదులకూ కనిపించటం లేదు విశ్వరూపం. అర్జునుడికి మాత్రమే ఒక స్వప్నం లాగా కనిపిస్తున్నది. అది కూడా స్వప్న దృష్టి లాటి ఒక ప్రత్యేకమైన దృష్టి దైవదత్తం కావటం మూలంగా ప్రాప్తించింది. అందులో కూడా స్వప్న దృశ్యం లాంటి విశ్వరూపమనే ఒక అద్భుతమైన దృశ్యమే కళ్ళ ముందు కనిపిస్తే చూస్తున్నాడు గాని అది ఏ దృక్కు మీద ఆధారపడి గోచరిస్తున్నదో ఆ దృక్కు సంగతి మరచిపోయాడు. ఆ దృక్కునే ఏకమని మహర్షి వర్ణించటం. అది దృశ్యాన్నంతా వ్యాపించిన
Page 390