#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

పశ్యాది త్యాన్ వసూన్ రుద్రాన్ - అశ్వినౌ మరుత స్తథా బహూ న్యదృష్ట పూర్వాణి - ప శ్యాశ్చర్యాణి భారత - 6

  అయినా చూస్తాననే ధైర్యమున్నదా నీకు. ఉంటే చూడుమరి. ఆదిత్యులున్నారు. వసువులున్నారు - రుద్రులున్నారు. వసురుద్రాదిత్యులు గణదేవతలు. వీరి సంఖ్య వరుసగా ఎనిమిది పదకొండు పన్నెండు. పోతే అశ్వినౌ అశ్వనీ దేవతలున్నారు. దేవ వైద్యులు వీరు. మరుతః మరుత్తులని ఉన్నారు. సప్త మరుద్గణాలు వీరు. ఇంతెందుకు. బహూన్య దృష్ట పూర్వాణి ఆశ్చర్యాణి. ఇంతవరకూ ఈ మనుష్యలోకంలో నీవెన్నడూ కనివిని ఎరగని అద్భుతాలెన్నో అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ నీకిప్పుడు బయట పెట్టి చూపబోతున్నాను. చూడగలిగితే పశ్య. చూడమంటున్నాడు పరమాత్మ.

  ఎక్కడ ఉన్నాయీ చెప్పిన వన్నీ. ఎలా చూపుతాడాయన. లేనివి అప్పటికప్పుడు తయారు చేసి చూపుతాడా. లేక ఉన్నవే తన దగ్గర గుప్తంగా ఉంటే ప్రకటం చేసి చూపుతాడా. ఇందులో ఏదైనా అది అబద్ధమే. సత్యం కాదు. ఎందుకంటే లేనిదెక్కడి నుంచీ రాదు. వచ్చిందంటే అప్పటికది ఒక స్వప్నం లాంటిదే. స్వప్నమంతకు ముందు లేనిదేగా తయారయి కనిపిస్తున్నది. అందుకే కనిపించినంత సేపూ కనిపించి తెల్లవారగానే మాయమయి పోతున్నది. కాగా మరి గుప్తమయిన దాన్నే ప్రకటం చేసి చూపాడంటారా. అయితే మరలా గుప్తమయి పోదని ఏమిటి నమ్మకం.

Page 383

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు