#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

తెలివితక్కువ వాడు. అలాటి తెలివి తక్కువవాడు గనుకనే ఒకప్పుడు నీ ఆత్మను చూడాలంటాడు. మరొకప్పుడు నీ విభూతిని చూడాలని కోరుతాడు. రెండూ విడి విడిగా ఉన్నాయను కొంటున్నాడో ఏమో. పైగా విభూతిని చూస్తే స్వరూపాన్ని చూచినట్టు కాదు గాని స్వరూపాన్ని గుర్తిస్తే మాత్రం విభూతిని చూచినట్టే. ఈ సూక్ష్మ మేమాత్రమూ స్ఫురించటం లేదర్జునుడికి. అందుకే ఈ ప్రశ్న.

పశ్యమే పార్ధ రూపాణి - శతశోధ సహస్రశః
నానా విధాని దివ్యాని - నానా వర్ణా కృతీని చ - 5


  అయితే అర్జునుడొక వేళ అజ్ఞానం వదలక ప్రశ్నించినా సర్వజ్ఞుడైన పరమాత్మకు తెలియదా అందులో తిరకాసు. ఆత్మ ఆత్మ అని వాచా అంటున్నా ఆత్మ మీదలేదు జిజ్ఞాస అర్జునుడికని బాగా తెలుసు ఆయనకు. కనుకనే అతడికి దేనిమీద ఉన్నదో అభిలాష దానికి తగినట్టే మాటాడుతున్నాడు. ఏమని. పశ్యమే పార్ధరూపాణి శతశోధ సహస్రశః బాబూ అర్జునా నా రూపాన్ని గదా చూడాలని కోరుతున్నావు. అది ఒకటి గాదు. వందలు వేలున్నాయి నాకు రూపాలు. చూస్తావా. అయితే చూడు. కాని ఎలా చూడగలవో ఏమో నా కనుమానం. ఎందుకంటే నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. చిత్రవిచిత్రమైన ఆకారాలూ రూపాలూ వర్ణాలవి. అవి కూడా భౌతికమైనవి కావు. అభౌతికమైనవీ. దివ్యమైనవీ.

Page 382

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు