#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

విస్తరశోమయా త్వత్తః నీ వల్ల నాకీ గోప్యమైన విషయమంతా సవిస్తరంగా బోధపడ్డదంటా డర్జునుడు. అంతే కాదు. మాహాత్మ్యమపి చావ్యయం. అవ్యయమైన ఆయన మాహాత్మ్యాన్ని కూడా వర్ణించి చెప్పాడని పొగుడుతాడు. మహానాత్మా మహాత్మా - మహాత్మ నస్తస్య భావః మాహాత్మ్యమ్. పెద్ద ఆత్మ ఏదో అది మహాత్మ. ఆత్మ పెద్దదెప్పు డవుతుంది. అనాత్మను కూడా తనలో కలుపుకొంటే. అప్పుడిక ఆత్మా అనాత్మా అని తేడా లేదు. అనాత్మగా ఏది కనపడుతున్నా దాని విభూతే అవుతుంది. అప్పటికి స్వరూప మాత్మ అయితే అనాత్మ దాని విభూతి. ఇందులో మొదటిది యోగం రెండవది విభూతి అని దీనికి ముందు విభూతి యోగంలో తెలుసుకొన్నాము.

  విభూతి క్రిందికి వస్తాయి జీవ జగదీశ్వరులు మూడూ. వాటి భవాప్యయాలు రెండూ త్వత్తః నీవల్లనే ఏర్పడుతున్నాయని చెప్పటంలో నీవనేది స్వరూపం క్రిందికి వస్తే దానివల్ల ఏర్పడే దంతా విభూతి క్రిందికి వస్తుంది. ఇక్కడ త్వత్తః మాహాత్మ్యమనే రెండు మాటల్లో స్వరూప విభూతులు రెండూ కలిసి వచ్చాయి. ఇదే ఇంతకుముందు విభూతి యోగంలో అంతకు ముందు ఏడు తొమ్మిది అధ్యాయాలలో ఏకరువు పెడుతూ వచ్చాడు మహర్షి పోతే ఎనిమిదవ దైన అక్షర పరబ్రహ్మాధ్యాయంలో భూత సృష్టి ప్రళయాలు కూడా పేర్కొన్నాడు కాబట్టి అవి కూడా భవాప్యయాలనే మాటల్లో గతార్ధ మవుతున్నాయి. ఇంతకూ ఈ విషయాలన్నీ నాకు నీవింత వరకూ బోధిస్తూ వచ్చావు గదా - నేను నీవు బోధిస్తూ ఉంటే శ్రవణం చేశానని గతాన్నంతా స్మరిస్తున్నా డర్జునుడు.

Page 378

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు