#


Index



విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత


తన శరీరంలోనే చూపినా అసత్యమే. దేశకాలాలే అసత్యమైనప్పుడు దేశకాలాలన్నీ ఒకచోటికి తెచ్చి తన విరాడ్డేహంలో చూపితే అది మాత్ర మసత్యం గాక సత్యమెలా కాగలదు. పరమాత్మకు బాహ్యంగా ఈ భౌతిక ప్రపంచమెలా అవాస్తవమో ఆ అభౌతిక ప్రపంచం కూడా అవాస్తవమే. విభూతిగా ఏదైనా అసత్కల్పమే. విభువుగానే అది సత్యం. మర్త్యమైన దృష్టితో చూచినా నీవు దివ్యమైన దృష్టితో చూచినా నీ స్వరూపానికి వేరుగా చూస్తున్నంత వరకూ అసత్యమే. జాగ్రత్ప్రపంచం లాంటిది భౌతికమైతే స్వప్న ప్రపంచంలాంటిది అభౌతికమైన ప్రపంచం. నీనీడ చూచి నీవు భయపడతావా. అలాంటిదే ఇదీ. రెండూ నీ స్వరూపానికి అన్యంగానే కదా కనిపిస్తున్నాయి. కనుకనే మర్త్య దృష్టి పని చేయలేదు దివ్య దృష్టీ పనిచేయలే దర్జునుడికి. అంటే మనకే. మరేది పనిచేసేది. నీలోనే అంతర్గతంగా ఉన్న దివ్య దృష్టి ఒకటున్నది. అది బ్రహ్మాకార వృత్తి. అది పైకి తెచ్చుకొని నీవే చూడు. అప్పుడు చిదాకాశ రూపంగా విస్తరించిన నీ శరీరం గాని శరీరంలోనే ఏకస్థమయి నీ విస్తారంగానే ఈ చరాచర ప్రపంచమూ నీకభిన్నంగా దర్శన మిస్తుంది. అప్పుడెవరూ నీకు దానం చేయనక్కర లేదు. నీదే ఆ దృష్టి. ఆగంతుకం కాదు. సహజం. దానికి కనిపించేది ఎంత అండపిండ బ్రహ్మాండాత్మకంగా విస్తరించినా అది నీదే నీవే. కనుక నీకప్పుడెలాంటి భయాందోళనలూ లేవు. నిజానికి రెండూ స్వప్నాలే. త్రయః స్వప్నా స్త్రయ ఆవసథాః అని శాస్త్రం ఘోషిస్తున్నది.

Page 373

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు