ప్రకాశిస్తున్నాడు గనుకనే మనకూ ప్రకాశాన్ని అందజేస్తున్నాడు. అలాగే అప్పుడర్జునుడి కైతేనేమి - ఇప్పుడర్జునుడి లాటి మనబోటి జీవులకైతేనేమి. ఇద్దరి స్థాయీ దాటి దేదీప్యమానంగా సర్వత్రా సర్వదా ప్రకాశించే ఆ ఈశ్వరుడే చూపవలసి ఉంది తన విశ్వరూపం. మనబోటివారికే నని ఎందుకనవలసి వచ్చిందంటే మనలో కూడా అతి మానుషమైన స్థాయి నందుకొన్న జీవన్ముక్తులైన మహానుభావులకు చూపనక్కర లేదు. వారు స్వయంగానే చూడగలరు. అలాగే దేశకాలాదులైన అవధులలోనే బ్రతుకుతూ తమకు కనిపించే ప్రపంచం వరకే చాలునని తృప్తి పడి జీవించే పండిత పామరులకూ అక్కర లేదు. వారికి సృష్టినంతా ఆకళించుకొందామనే జిజ్ఞాసే లేదు గదా.
పోతే మరీ అల్పజ్ఞులూ గాక మరీ బ్రహ్మజ్ఞులూ గాక మధ్యలో బ్రతికే జిజ్ఞాసువులకే ఉంటుందీ ఉత్కంఠ. అదేదో చూడాలనే ఆకాంక్ష. ఇలాటి ఆకాంక్షతోనే అడిగాడర్జునుడు నీ విశ్వరూపం చూడాలని ఉంది చూపమని, అర్జునుడి బురఖాలో బ్రతుకుతున్న మనబోటి జీవులకూ ఉందదేదో ఆఈశ్వరుడు చూపితే బాగుండునని. కాని ఇద్దరమూ మనమొక అంశం మరచిపోతున్నాము. ఈశ్వరుడి సమగ్రమైన రూపం చూడాలంటే ఆ ఈశ్వరుడి స్థాయినే అందుకొని గాని చూడలేము. ఈశ్వరుడు కాకుండా జీవులమే అయి ఈశ్వరుడి విభూతి నెలా దర్శించగలం. అది అత్యాశ. అసంభవం. అందుకే నీవు ముచ్చట పడుతున్నావు. అలాగే చూపుతాను
Page 362