#


Index

విభూతి యోగము భగవద్గీత

విభూతిని చెబితే వినాలని నీవు ముచ్చట పడుతున్నావు. కాని నిశ్శేషంగా వర్ణించటం సాధ్యం కాదు. ఎందుకంటే అది అనంతం. అయినా అడిగావు కాబట్టి ఆయా జాతులలో ప్రధానమైన వాటిని మాత్రం నీకు ఉదాహరిస్తాను. అది ఉపలక్షణమని Indication భావించి మిగతా సృష్టినంతా ఊహించుకోమని గదా వాక్రుచ్చాడాయన. ఇలా ప్రధానంగా ఉపలక్షణంగా భావించి పేర్కొనటం వల్లనే ఆదిత్యానా మహం విష్ణుః అని ఒక్కొక్క దాన్నే వరుసగా చెబుతూ వచ్చాడు. అంతే గాని ఆ మేరకే నిలిచిపొమ్మని గాదు. అలా నిలిచి పోగూడదనే భావంతోనే నాంతోస్తి మమ విభూతీనా మని మరలా హెచ్చరిస్తున్నాడు.

యద్య ద్విభూతి మ త్సత్త్వం - శ్రీమ దూర్జిత మేవ వా
తత్త్వ దేవా వగచ్ఛత్వం - మమ తేజోం శ సంభవమ్ - 41


  అయితే అంతా నా విభూతేనని చెబితే ఒక్కసారిగా మానవుడి మనసు అన్ని భావాలనూ కలిపి ఆకళించుకోటం చాలా కష్టం. చెదిరిపోతుంది బుద్ధి సాధారణంగా. అలా చెదిరిపోతే తద్ద్వారా భగవత్స్వరూపాన్ని పట్టుకోట మసాధ్యం. అందుకే సలహా ఇస్తున్నాడు. మధ్యమాధి కారులైన మానవులకు పరమాత్మ. ఏమని. యద్య ద్విభూతి మత్ - ఏదేది నీకు లోకంలో విశేషంగా కనిపిస్తూ నీ దృష్టి నాకర్షిస్తుందో - శ్రీమ దూర్జిత మేవ వా ఏదేది శోభాయ మానంగా ఉదాత్తంగా కొట్ట వచ్చినట్టు దర్శనమిస్తుందో అది స్థావర జంగమాలలో ఏదైనా కావచ్చు.

Page 342

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు