#


Index

విభూతి యోగము భగవద్గీత

అనంత శ్చాస్మి నాగానాం- వరుణోయాదసా మహం
పితృణా మర్యమా చాస్మి - యమస్సంయ మతా మహమ్- 29


  పోతే నాగజాతిలో అనంతుడనే నాగరాజును. అప్పటికి సర్పజాతి వేరు. నాగజాతి వేరు. యదువ్యష్టి భోజాంధక జాతులలాగా అన్నీ ఒకటిగా కనిపిస్తున్నా అవాంతర భేదా Sub divisions లెన్నో ఉన్నాయి వాటిలో. వరుణోయాదసామ్ - యా దస్సులంటే జల దేవతలు. వారికి వరుణుడే అధిపతి. అతడట పరమాత్మ. పితౄణా మర్యమా. పితృగణాలని ఉన్నాయి దేవతలలో. వారిలో అర్యముడనే వాడట తాను. యమ స్సంయమతాం. సంయమనమంటే అన్నిటినీ అదుపులో పెట్టుకోటం. అలాంటి వారిలో యమ ధర్మరాజు పరమాత్మ.

ప్రహ్లాద శ్బా స్మి దైత్యానాం - కాలః కలయతా మహం
మృగాణాంచ మృగేంద్రోహం - వైనతే యశ్చ పక్షిణామ్- 30


  దితి వంశీయులైన రాక్షసులలో ప్రహ్లాదుణ్ణంటాడు. పోతే కలనమంటే గణనం లెక్కించటం. అలా లెక్కించే వాటిలో కాలం నేను. మృగాలంటే క్రూర జంతువులు. సింహ వ్యాఘ్రాదులు. వాటిలో సింహాన్ని నేను. వైనతేయు డంటే వినత కుమారుడు. గరుత్మంతుడు. పక్షులన్నింటిలో గరుడాళ్వారును నేనంటాడు.

పవనః పవతా మస్మి - రామః శస్త్ర భృతా మహం
ఝషాణాం మకరశ్చాస్మి - స్రోతసా మస్మి జాహ్నవీ - 31

Page 333

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు