మరచిపోరాదు మనం. అలాంటప్పు డీశ్వరుడు సర్వభూతాల లోపలే ఉన్నాడని చెబితే ఏమి మర్యాద. వెలపల లేడా వాటన్నింటి రూపంగా లేడా అని ఆకాంక్ష తీరదు మనకు. అది మనకు తీర్చటానికే మరలా చెబుతున్నా డిప్పుడు. ఏమని. అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ. భూతమనే శబ్దాన్ని గమనించండి. రెండుమార్లు ప్రయోగిస్తున్నాడు మహర్షి ఈ శ్లోకంలో. మొదటిది చేతన పదార్ధాలను చెప్పటానికి. మరొకటి అచేతన జగత్తును చెప్పటానికి. భూతమనే మాటకు సంస్కృత భాషలో చేతనా చేతనాలు రెండూ అర్థమే. భూత దయ అనే చోట చేతనమని అర్థం. పంచభూతాలనే చోట అచేతనమని అర్ధం. ఇప్పుడీ మాట రెండుసార్లు ప్రయోగించటం వల్ల చేతనా చేతన సృష్టి అంతా కలిసి వస్తున్నది.
పోతే వాటన్నింటి లోపలే గాదు. ఆది మధ్యాంతాలలో కూడా ఈశ్వర చైతన్యమే నిండి నిబిడీకృత మయి ఉంది. ఆదిలో మధ్యంలో అంతంలో నని కూడా కాదు. అలాగైతే అవి చైతన్యాని కాధార మవుతాయి. ఈశ్వర చైతన్యం వాటి కాధేయ మవుతుంది. అది మరీ ప్రమాదం. అందుకే నేనే వాటికాది నేనే వాటి మధ్యం నేనే వాటి అంతమని చాటి చెబుతున్నాడు. ఆద్యంతాలంటే రెండు అగ్రాలూ, రెండంచులూ. ఒక పదార్ధాని కంచులు రెండే. పయి భాగమొకటి. అడుగు భాగమొకటి. అవి రెండూ పరమాత్మ తానేనని చాటటం మూలాన పదార్ధం లోపలనే గాక
Page 324