#


Index

విభూతి యోగము భగవద్గీత

దేవలుడూ - వ్యాసుడూ ఇలాటి వారంతా. ఈ వ్యాసుడు భారత ప్రణేత వ్యాసుడా కాదా అని అనుమానం. అయినా కావచ్చు. కాకపోవచ్చు. వ్యాస అనే పేరు విశేష వాచకమే కాదు. సామాన్య వాచకం కూడా. వేద వ్యాఖ్యాత Exponant అని కూడా అర్థమే కాబట్టి అలాటి వేద ఋషి అయినా కావచ్చు. మరి ఈ ఋషులందరూ చెప్పటమే గాదు. నిన్ను గూర్చి నీవే ఇలా చెప్పుకొంటున్నావు. స్వయం చైవ బ్రవీషిమే.

సర్వమేత దృతం మన్యే యన్మాం వదసి కేశవ
సహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః - 14


  మరి ఈ ఋషులూ నీవూ ఇద్దరూ చెప్పిన మాటలన్నీ ఋతం మన్యే యధార్ధమనే నమ్ముతున్నా నేను. ఎందుకంటే నహితే వ్యక్తిం విదుః నీ స్వరూపమసలు ఏమిటో ఎవరికీ తెలియదు. దేవా న దానవాః – దేవతలకూ తెలియదు. దానవులకూ తెలియదు. కామ పరాయణులు గనుక దేవతలకూ తెలియదు. క్రోధ పరాయణులు గనుక దానవులకూ తెలియదని భావం. పోతే మహర్షులకో. వారికి కూడా పూర్తిగా తెలుసునని నమ్మకం లేదు. అది అర్జునుడు వాచా చెప్పక పోయినా కృష్ణ పరమాత్మే చెప్పాడింతకు పూర్వం. నమే విదుస్సుర గణాః ప్రభవం న మహర్షయః అంటే అర్థమేమిటి. నామూలమేమిటో నా ప్రభావమేమిటో దేవతల లాగే మహర్షులకు కూడా అంతుపట్టదనే గదా. క్రాంత దర్శీ ఋషిః అన్నారు. దేశకాలాదులైన అవధులను దాటి చూచేవాడే ఋషి. అలాటి వారికి కూడా అగమ్యగోచర మన్నాడంటే ఇక అర్జునుడు వర్ణించిన నారదాదు లెటుపోయారో.

Page 308

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు