#


Index

విభూతి యోగము

దర్శన మిస్తుంది. అదీ శరీరమనే ఉపాధి వీడికున్నంత వరకే. అది కూడా తీరిపోతే అప్పుడు విభూతిగా కూడా కనిపించదు. అది తన శక్తిగానే అనుభవానికి వస్తుంది.

  కనుక మనసూ ప్రాణమూ నాలో ఉంచటమంటే వ్యష్టి చైతన్యాన్ని సమష్టిగా దర్శిస్తారు జ్ఞానులని భావం. మనసూ ప్రాణమే గదా జీవభావం. అవి రెండూ పరమాత్మ కప్పచెబితే అది ఇక పరమాత్మే. జీవాత్మ గాదు. ఇంత వరకూ ఇది యోగం. అంటే స్వరూప స్థితి జ్ఞానికి. దీనికే సమాధి అని కూడా పేరు. పోతే ఇక వ్యవహారమెలా ఉంటుందని గదా అడిగారు. ఎలా ఉంటుందో చెబుతున్నది గీత. బోధయంతః పరస్పరం కధయంత శ్చమాం నిత్యం. ఒకరికొక రిలాటి అధ్యాత్మ జ్ఞానాన్ని చెప్పుకొంటూ ఉంటారట. అంతేగాక జ్ఞానబల వీర్యాది లక్షణాలతో ఆ స్వరూపాన్ని తాము పట్టుకోటమే గాక లోకంలో అదే ప్రచారం చేస్తూ పోతారట. తుష్యంతి చరమంతిచ. అలా చేస్తూ పోతున్నా తమ లోపల తామెప్పుడూ తృప్తి చెందుతూ ఆ భావంలోనే ఎప్పుడూ ఆనందిస్తూ బ్రతుకుతుంటారట కూడా. ఇదుగో ఈలాటి ప్రవర్తన వారి వ్యవహారం. రెంటికీ వైరుధ్యం లేదు. మానసికంగా దృష్టి బాహ్యంగా ప్రవృత్తి. రెండూ పేచీ పడవు. దృష్టి వదల కుండా సృష్టిని చూస్తుంటాడు కాబట్టి జ్ఞాని చైతన్య ప్రకాశం దీని మీదా పడి ఆ వెలుగులోనే అటు అంతర జీవితమూ ఇటు బాహ్య జీవితమూ రెండూ ఒకే మార్గంలో సాగిపోతుంటాయి.

Page 299

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు