యుక్తులయి భజిస్తారట. ఇక్కడ బుధులంటే ఎవరో భావమంటే ఏమిటో అద్భుతంగా వివరించారు భాష్యకారులు. బుధాః అవగత పరమార్థ తత్త్వాః భావః భావనా పరమార్థ తత్త్వాభినివేశః అని నిర్వచించారు. పరమార్ధమేమిటో దాన్ని స్వానుభవానికి తెచ్చుకొన్నవారు బుధులు. దానిలోనే నిరంతరమూ నిలిచి పోయినవారు భావ సమన్వితులు. అంటే ఆత్మజ్ఞానమూ జ్ఞాన నిష్ఠా రెండూ నూటికి నూరుపాళ్లూ ఉన్నవారే స్వరూప విభూతులను రెంటినీ వేరుగా చూడరు. ఆత్మానాత్మలను రెండింటినీ ఆత్మ రూపంగానే దర్శించగలరు. వారికి సమాధీ వ్యవహారమూ రెండూ వేరుగావు. లోకంతో వ్యవహరిస్తున్నా అది అద్వైత సమాధే.
మచ్చిత్తా మద్గత ప్రాణా బోధ యంతః - పరస్పరం
కధయం తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ - 9
సమాధీ వ్యవహారమూ రెండూ జోడు గుఱ్ఱాల స్వారిలాగా సాగిస్తారు వారంటున్నారే. అది ఎలా సాగిస్తారని ఆశంక ఏర్పడితే ఆ విధానాన్ని వర్ణిస్తున్నాడు మహర్షి. మచ్చిత్తా మద్గత ప్రాణాః - మనస్సూ ప్రాణమూ తనకే అప్పగిస్తా రంటున్నాడు పరమాత్మ. ఇక్కడ మత్ అంటే నాకు అని గదా అర్థం. ఆ నేననేది రెండు. ఒకటి పరమాత్మ. మరొకటి జీవాత్మ. ఇందులో జీవాత్మ వ్యష్టి, పరమాత్మ సమష్టి. వ్యష్టి చైతన్యం వ్యష్టిగానే ఉంటే ద్వైతం లయం కాదు. అది సమష్టిగా తన్ను భావించినప్పుడే పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడిక సంసారంగా కనిపించదీ సృష్టి. విభూతిగా
Page 298