#


Index

విభూతి యోగము

అక్కడ ఒక మాట అన్నాడు. మరీచి దగ్గరి నుంచి భృగువు వరకూ లెక్కపెడితే ఏడుగురు. మళ్లీ భృగువు దగ్గరి నుంచి పెట్టి చూచినా ఏడుగురే. ఇలా సమర్ధించాడీ సప్త అనే సంఖ్యానాయన. మరి అలాంటప్పుడు వసిష్ఠ నారద ప్రచేతసు ల నేమి చేయాలి. వారు ప్రజాపతులు కారా. మనుస్మృతి ప్రమాణమే గదా భగవత్పాదులకు. నిజమే. వారందరూ వీరి తరువాత వచ్చిన వారనుకోవా లేమో. అందుకే ఆ ఏడుగురూ పూర్వులని చెప్పటం. అదేమిటి. కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి లాంటి వాళ్లేమయ్యారని కూడా ప్రశ్న వస్తుంది. అప్పుడు మనువు చెప్పిన లెక్క కూడా దాటి పోతుంది. కాబట్టి భగవత్పాదులు చెప్పిన మాటైనా అనుసరిస్తే సరిపోతుంది. లేదా సప్త అనే మాట వసిష్ఠుడు భరద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడూ ఇలాటి ప్రసిద్ధులైన సప్త మహర్షులని చెపుకొన్నా సరిపోతుంది. ఇక చిక్కు లేదు.

  మొత్తాని కిలాటి మహర్షులే గాక మనువులకు కూడా జన్మ కారణం పరమాత్మే నట. మనువు లంటే వారెంతమంది. చత్వారః నలుగురే నంటాడు. ఇక్కడ కూడా లెక్కలో ఒక చిక్కు వచ్చింది. నలుగురేమిటి. పద్నాలుగు రున్నారు పురాణ వాఙ్మయంలో. స్వాయంభువ స్వారోచిషాదులు వారే. వారందరినీ లెక్కకు తీసుకొంటే సరిపోదిక్కడా. నలుగురినే చెప్పుకోవాలి మనం. అది ఎలాగంటే దానికీ సంజాయిషీ ఇస్తున్నారు భాష్యకారులు. సావర్ణా ఇతి ప్రసిద్ధాః అని భాష్యం. మేరు సావర్ణి - రుద్ర సావర్ణి - దక్ష సావర్ణి - బ్రహ్మ సావర్ణి అని నలుగురున్నారు సావర్ణ

Page 291

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు