మహర్షయ స్సప్త పూర్వే - అందుకే అంటున్నాడు భగవానుడు మహర్షులనే వా రేడుగురూ మదీయా మానసా జాతాః - నా మనస్సంకల్పం వల్లనే జన్మించారు. ఇప్పుడు గాదు. పూర్వే అతీత కాలంలో ఎప్పుడో సృష్టి అయ్యారు. అది కూడా ఇతర ప్రాణులలాగా భౌతికంగా కాదు. మానసికంగా. ఎవరింతకూ ఆ మహర్షులు. ఏడు గురే నంటున్నారు. ఎవరా ఏడుగురు. భృగ్వాదులని వ్రాస్తున్నారు భగవత్పాదులు. వీరికే ప్రజాపతులని పేరు. వీరివల్లనే తరువాత ప్రజాసృష్టి జరిగింది. కనుక వీరికి ప్రజాపతులని పేరు వచ్చింది. పైగా మిగతా ప్రజలంతా భౌతికంగా ఏర్పడితే వీరికి ముందున్నది పరమాత్మే కాబట్టి అలా భౌతికంగా గాక మానసికంగా ఏర్పడింది వీరి సృష్టి. కనుకనే మదీయా మానసా జాతా అని ప్రత్యేకించి చెబుతున్నాడు భగవానుడు.
మరి భృగ్వాదులంటే ఎవరీ భృగ్వాదులు. ఎంతమంది వీరు. ఏడుగురేనా. కాదు ప్రజాపతులు పదిమంది అని చెబుతున్నది మనుస్మృతి. మరీచి అత్రి అంగిరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు భృగువు వసిష్ఠుడు ప్రచేతసుడు నారదుడు. ఇలా పదిమంది ప్రజాపతులని స్మృతి గ్రంధాలు పేర్కొంటుంటే భగవద్గీత ఏమిటి ఏడుగురని చెబుతున్నది. భగవత్పాదులేమి చెబుతారా అని చూస్తే ఆయన పాము చావకుండా కఱ్ఱ విరగకుండా ఒక మాట అంటాడు. భృగ్వాదయః అని ఇక్కడ ఒక మాట అన్నాడు. భగవద్గీత కుపోద్ఘాతం వ్రాస్తూ మరీచ్యాదీ నగ్రే సృష్ట్వా ప్రజాపతీ నని
Page 290