#


Index


విభూతి యోగము

రాజసా స్తామసాశ్చ యే - మత్త ఏ వేతి తాన్విద్ధి. సాత్త్విక రాజస తామస భావా లెప్పుడెవరికి మనసులో ఉదయిస్తున్నా అవి మత్త ఏవేతి తాన్విద్ధి అవన్నీ నావల్లనే ఏర్పడుతున్నాయని అక్కడ కూడా అంటాడు భగవానుడు. సరిగా ఆ శ్లోకాని కంది పుచ్చుకొన్న ట్టున్నదీ శ్లోకం. కాని ఒక చిన్న మాట అక్కడ అదనంగా దొర్లింది భగవానుడి నోట. అదేమిటంటే నత్వహం తేషు తే మయి అని ఒకరహస్యం బయటపెట్టా డక్కడ. అంటే ఏమని అర్ధం. అవన్నీ నాలో ఉండవలసిందే గాని నేను మాత్రం వాటిలో లేనంటాడు. ఇది చాలా గంభీరమైన మాట. ఆత్మ చైతన్యం వస్తువైతే Sub ఈ భావాలన్నీ దాని ఆ భాసలు Forms. ఆ భాస వస్తువు కన్నా వేరుగాదు గాని వస్తువు మాత్రం దాని ఆ భాస కన్నా వేరుగా ఉండగలదు. బంగారం కన్నా దాని సొమ్ములు వేరుగా ఎక్కడా లేవు. వేరయితే స్వతంత్రంగా బ్రతకలేవు. దానిమీద ఆధారపడి బ్రతకవలసిందే. కాని బంగారం మాత్రమలా కాదు. కంటెలు కమ్మలు కాసుల పేర్లు ఉన్నా లేకున్నా దానిపాటి కది స్వయంగా ఉండగలదు.

  అలాగే ఆత్మ చైతన్యం తన పాటికి తాను నేనున్నాననే స్ఫురణతో స్వతహాగా ఎప్పుడూ ఉంటుంది. మనోవాక్కాయాదుల మీదా వాటి వ్యాపారాల మీదా ఆధారపడ నక్కర లేదది. మీదు మిక్కిలి ఇవే దాని నాధారం చేసుకొని బ్రతుకుతున్నాయి. నేననే స్ఫురణ లోనే గదా నా మనసులో ఆలోచనలూ మాటలూ చేష్టలూ అన్నీ కలుగుతుంటాయి.

Page 288

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు