#


Index

విభూతి యోగము భగవద్గీత సర్వస్వం

ఆరోపిత మా అధిష్ఠాన రూపమైన జ్ఞానమే. అది స్వరూపమేనని గుర్తించకపోతే అజ్ఞానం. గుర్తిస్తే జ్ఞానం. మొదటిది సంసార బంధం. రెండవది సాయుజ్య గంధం. ఇంతకన్నా ఏముంది గీత మనకు బోధించవలసిన విషయం. 18 అధ్యాయాలలో వర్ణించి చెప్పినదంతా ముద్ద చేసి ఒక్కమాటలో చెబితే ఇంతే. ఇలా ఒక్కచోట ముద్ద చేసి మూట గట్టి మనచేతి కందించిన ఏకైక అధ్యాయం భగవద్గీతలో ఇది ఒక్కటే ఈ దశమాధ్యాయం. కనుక దీని ఆంతర్యం బాగా అవగతం చేసుకోవాలంటే ఎంతైనా భావన చేయవలసి ఉంటుంది దీని మీద. మొదటి శ్లోకంలోనే దీని విశిష్టత ఏదో సూచిస్తున్నా డిప్పుడు మహర్షి.

భూయ ఏవ మహాబాహో - శృణు మే పరమం వచః
యుత్తే హం ప్రీయ మాణాయ - వక్ష్యామి హిత కామ్యయా -1


  భూయ ఏవ మహా బాహో శృణు. మరలా నీకు నేను చెప్పవలసిన మాట ఒకటున్నది వినమంటున్నాడు భగవాను డర్జునుడితో. మరలా చెబుతున్నానంటే ఏమిటర్ధం. ఇంతకు ముందు చెప్పిన మాట కూడా కాదు. అంతకు మించిన దొకటున్న దని గదా. అందుకే అంటున్నాడు పరమం వచః అని. పరమం వచః అంటే చాలా గొప్ప మాట. అంతకుముందు చెప్పిన మాట కన్నా ప్రశస్త మైనది. చాలా ముఖ్యమైన దని భావం. అంతకు ముందేమి చెప్పాడింతకూ. ఇప్పుడు దాన్ని కూడా మించిన మాట ఏమి చెప్పబోతున్నాడని ప్రశ్న. ఇంతకు ముందు రాజవిద్యా రాజగుహ్య యోగ మనే అధ్యాయం చివర ఒక మాట వచ్చింది. మన్మనా భవ మద్భక్తః అని

Page 273

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు