#


Index

విభూతి యోగము

కనుక ఏయే భావాలలో ఆ తత్త్వాన్ని భావిస్తే సరిపోతుందో అది కూడా చెప్పమని ప్రాధేయ పడతాడు. అలాగే సమాధాన మిస్తాడు కూడా పరమాత్మ. నాస్త్యంతో విస్తరస్య మే. నా విభూతి ఇంత అని చెప్పలేను. అది అనంతం. కాని నీవడిగావు కాబట్టి ప్రాధాన్యతః కథ యిష్యామి. అందులో ఏది ఉల్బణంగా ప్రధానంగా కనిపిస్తుంటుందో అది మాత్రమే నీకు బయటపెట్టి చెబుతాను. దాన్ని పట్టుకొన్నా చాలు. నీవు ధన్యుడవై పోతావని హామీ ఇస్తాడు.

  దీన్ని బట్టి రెండు విషయాలు మనకిప్పుడు బోధపడుతుతున్నాయి. ఒకటి భగవద్విభూతి ఎంతటిదో దాన్ని సాంగోపాంగంగా వర్ణించటం. రెండు అందులో మధ్యమాధికారుల లెవలుకు తగినట్టు అతి ముఖ్యమైన భావమేదుందో దాన్ని బయటపెట్టటం. ఇప్పుడీ రెండు భావాలూ ఇంతకు ముందు గడచిన అధ్యాయాలలో లేవు. కనుక వాటిని మనకు బోధించటానికే వచ్చింది ఈ అధ్యాయం. అంతేగాక వాటితో పాటు అడపా దడపా తత్త్వంచ భగవతో వక్తవ్య ముక్త మపి. భగవత్స్వరూపం కూడా చెప్పాలను కొన్నాడట వ్యాస భగవానుడు. అది ఇంతకుముందే చెప్పాడు గదా అంటే నిజమే చెప్పి ఉండవచ్చు. అయినా మరలా చెప్పటం మంచి దనుకొన్నాడు. ఎందుకంటే దుర్విజ్ఞేయత్వా తంటారు భాష్యకారులు. ఎంత చెప్పినా అది దుర్విజ్ఞేయం. అంత సులభంగా బోధపడే విషయం కాదు. కనుకనే సమయం వచ్చినప్పుడల్లా చెబుతూ పోవటమే మంచిదంటాడు. పదే పదే చెబుతుంటే

Page 271

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు