#


Index

విభూతి యోగము

  పోతే ఇప్పుడీ యోగమేమిటో దాని విభూతి ఏమిటో రెండింటినీ రెండుగా గాక ఏకంగా దర్శించే విధానమేమిటో పూసగుచ్చినట్టు వర్ణించటానికే వచ్చిందీ విభూతి యోగమనే అధ్యాయం. పరమాత్మ తాలూకు విభూతి ఎలాటిదో ఇంతకు ముందే ప్రస్తావనకు వచ్చింది. సప్తమాధ్యాయంలోనూ నవమాధ్యాయంలోనూ కొంతకు కొంత వర్ణిస్తూనే వచ్చాడు వ్యాసమహాముని. అదే వ్రాస్తున్నారు అవతారికలో భగత్పాదులు. సప్తమే అధ్యాయే భగవత స్తత్త్వం విభూతయశ్చ ప్రకాశితాః - నవమేచ. ఏడు తొమ్మిది అధ్యాయాలలో భగవత్స్వరూపమూ దాని విభూతులు రెండూ బయట పెట్టింది గీత అంటారాయన. ఇక్కడ తత్త్వమంటే యోగమే. పోతే దాని విస్తారమే విభూతి. అయితే ఆ రెండధ్యాయాలలో ఎంత వర్ణించినా పూర్తిగా వర్ణించ లేదు విభూతిని భగవద్గీత. కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే ఉదాహరిస్తూ వచ్చింది. పోతే ఇక్కడ ఈ అధ్యాయంలో అలా కాదు. సాంగోపాంగంగా వర్ణిస్తుంది భగవద్విభూతిని. అది అర్జునుడి మాటలలోనే వ్యక్త మవుతున్నది మనకు. విస్తరేణాత్మనో యోగం విభూతించ అని గదా అడిగా డర్జునుడు. సవిస్తరంగా చెప్పమంటా డర్జునుడు. అంతకు ముందే సవిస్తరంగా చెప్పి ఉంటే ఎందుకడుగుతా డలాగా. అప్పటి కంతకు ముందు రెండధ్యాయాలలో విపులంగా వర్ణించి చెప్పలేదన్న మాట. అందుకే అలా అడిగాడు అంతేకాదు. కేషు కేషుచ భావేషు చింత్యోసి అని మరి ఒక విషయం కూడా అడుగుతాడు. విభూతి ఎంతైనా వ్యాపించి ఉండవచ్చు. కాని అది అంతా ఆకళించు కోవాలన్నా మనసుకు పట్టాలన్నా కష్టతరం.

Page 270

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు