భగవానుడు మొదట్లోనే ప్రస్తావిస్తాడు. అంతే కాదు. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కధయ. నీ యోగమూ విభూతీ రెండూ నాకు వర్ణించి చెప్పమని అర్జునుడూ కూడా అలాగే అడుగుతాడా యనను. దీన్ని బట్టి ఈ అధ్యాయంలో యోగమూ విభూతీ ఈ రెండు విషయాలూ వ్యాసమహర్షి నిరూపించ బోతున్నాడని గదా అర్థమవుతున్నది. అంచేత మిగతా అధ్యాయాలలాగా కేవల మధ్యాయానికి పెట్టిన పేరే గాదిది. అధ్యాయ నామమే గాక అధ్యాయ విషయం కూడా యోగమే.
అసలా మాటకు వస్తే ఈ అధ్యాయ మొకటే అన్ని అధ్యాయాలకూ జవాబు చెప్పగల దనటంలో కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే అసలున్న విషయాలు వేదాంతంలో అవి రెండే. ఒకటి యోగం. మరొకటి విభూతి. ఇవి రెండూ తప్ప ఇక మనం తెలుసుకోవలసింది ఏదీ లేదు. ఆధ్యాత్మికంగానే కాదు. ఆధి భౌతికంగా కూడా ఉన్న విషయాలివి రెండే. ఇందులో యోగమంటే జ్ఞానం. విభూతి అంటే దాని విస్తారం. ఒకటి వస్తువు. మరొకటి ఆభాస. ఒకటి స్వరూపం మరొకటి విభూతి. ఒకటి ఆత్మ మరొకటి అనాత్మ. ఒకటి నేననే స్ఫురణ. వేరొకటి ఆ స్ఫురణకు గోచరించే సమస్తమూ - నేనూ నాదీ. అహం మమ. ఇంతే గదా సృష్టినంతా ఎంత దూరం గాలించినా నీకూ నాకూ మనసుకు వచ్చేది. ఇంతకన్నా ఏముంది. వీటికే యోగమని విభూతి అని నామకరణం చేశాడు మహర్షి జ్ఞానమే యోగం. జ్ఞేయమే దాని విభూతి. కలిసి ఉంటే యోగం. విడిపోయి
Page 264