అసలు మాం మాం అని ప్రయోగించటంలో - అదీ మాటి మాటికీ మన చెవిలో పడటం లోనే ఒక ఆంతర్యమున్నది. మామ్మ నేది అహమనే దానికి ద్వితీయా విభక్తి ఏకవచన రూపం. నన్ను అని అర్ధం. నేనే గదా నన్నయింది. నేనంటే అది ఆత్మేగదా. ఆత్మ అంటే నేననే స్ఫురణ అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నాము. నేనన్నా అహమన్నా ఆత్మ అన్నా ఒకటే అప్పటికి. అయితే ఎటువచ్చీ ఈ నేను అటు ఈశ్వరుణ్ణి ఇటు జగత్తునూ నాది అని చూడకుంటే సరి. నాది అని చూచే సరికది తనకంటే వేరనే భావ మేర్పడుతుంది. అదే సంసారం ఆభాస అని మేము పేర్కొనటం. అది కూడా నాదిగా గాక నేననే ఆత్మ భావనతోనే చూడగలిగా మంటే నాది నేనులో కలిసిపోయి నేననే ఆత్మభావం ఏకాత్మ లేదా సర్వాత్మ భావంగా దర్శన మిస్తుంది. అందుకే మాం మాం అని పదే పదే మనలను హెచ్చరించటం భగవానుడు. నన్నే చూడు నాకు భిన్నంగా ఏదీ చూడవద్దని హెచ్చరిక. ఈ హెచ్చరిక నందుకొని దాని కనుగుణంగా సర్వమూ ఆత్మ స్వరూపమే నని దర్శించటమే మానవ జీవితానికి సాఫల్య మని సారాంశం.
ఇతి
రాజ విద్యా - రాజ గుహ్య యోగః సమాప్తః
Page 262