#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

నాకు దగ్గర పడితే అంతంతే నా అనుగ్రహం వారికి. ఎంతెంత దూరమైతే అంతంత ఆగ్రహమే. అలాగని ఆగ్రహాను గ్రహాలు నాకున్నాయని గాదు. వారికలా భాసిస్తున్నాను నేను. నాకు వారు శత్రువులు కారు. వారి దృష్టిలో నేను వారికి శత్రువును. ఆమాటకు వస్తే వీరికి నేను మిత్రుణ్ణి కాను. వారి దృష్టిలో మిత్రుణ్ణి. అందుకే నావల్ల ఫలితం పూర్తిగా పొందా లనిపిస్తే భజంతి తుమాం భక్త్యా. భక్తితో నన్ను భజించమని సలహా ఇస్తున్నాడు.

  భక్తి భజన రెండూ ఒకటే గదా. భక్తితో మరలా భజించట మేమిటి. ఏమిటో నారద మహర్షి నడిగితే చెబుతాడు మనకు. రాజసూయ యాగంలో నారదుడు ధర్మరా జడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఒక రహస్యం బయటపెట్టాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు - అనే పద్యం భాగవతం చదివిన భక్త మహాశయు లందరికీ నోటికి వచ్చిన పద్యమే. అక్కడ గోపికల దగ్గరి నుంచి పాండవుల వరకూ అందరి విషయమూ వర్ణించి చివరకు భక్తి మేము నని తన వంటి వారి విషయం పేర్కొంటాడు. అక్కడ మీరు బాగా గమనిస్తే భక్తి అనే మాట ఎక్కడా వాడక తమబోటి మహర్షుల విషయంలోనే వర్ణిస్తాడు. అంటే ఏమన్న మాట. గోపికాదుల కున్నది భక్తిగాదు. భక్త్యాభాస. ఏమి కారణం. కామాది వాసనలతో మిళితమై ఉన్నదా భక్తి. పోతే అచ్చమైన అనన్యమైన భక్తి తమకే ఉన్నదని చెప్పాడు. అనన్యమైన భక్తి అంటే అది జ్ఞానమే. అందుకే వారంతా హరిఁ జెందన్వచ్చునని ఆ పరమాత్మను చెందారే గాని పరమాత్మ మాత్రం వారిని చెందినట్టు చెప్పలేదు.

Page 252

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు