#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

ఆత్మ జ్ఞానం. ఆత్మార్పణ. వాడికి కర్మ కూడా అకర్మే. ఇది కర్మణ్య కర్మ అనే శ్లోకానికి ప్రతిధ్వని అని భావించవచ్చు.

శుభా శుభ ఫలై రేవం- మోక్ష్యసే కర్మ బంధనైః
సన్న్యాస యోగ యుక్తాత్మా - విముక్తో మా ముపైష్యసి - 28


  కర్మ సన్న్యాస మంటే ఇదే. కేవలం సన్న్యాసం కాదు. కేవలం కర్మాచరణం కాదు. జ్ఞాన దృష్టితో సర్వాత్మ భావనతో కర్మ చేయటం చేస్తాడు కాబట్టి యోగం. చేసినా ఆత్మ భావనతో చూస్తాడు కాబట్టి సన్న్యాసం. ఇలాటి సన్న్యాస యోగాలు రెండింటితోనూ కూడిన ఆత్మా. అంతఃకరణ మున్న వాడెవడో వాడు సన్న్యాస యోగ యుక్తుడని అర్థం వ్రాశారు భగవత్పాదులు. అలాటి భావన ఉన్న మహానుభావుడు త్రికరణాలతో ఏ పని చేస్తున్నా అది ఎప్పటికప్పుడు వాడి జ్ఞానాగ్నిలో కట్టెలలాగా కాలి బూడిద అయి పోతుంది. కాబట్టి శుభాశుఫలై రేవం మోక్ష్యసే కర్మ బంధనైః - పుణ్యపాప ఫలం వాడినంటదు. అలాటి కర్మఫలమే మానవుడికి బంధం కల్పిస్తుంది. సంసార పాశంతో కట్టి పడేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో పుణ్యపాపాది ద్వంద్వాలు భస్మమయి పోయాయో ఇక వాటి బంధం లేదు జ్ఞానికి. మోక్ష్యసే. బంధం నుంచి బయటపడ్డవాడే. అయితే శరీరమనే ఉపాధి ఒకటి ఉన్న నేరానికి ప్రారబ్ధ కర్మఫల మను భవిస్తూ జీవన్ముక్తుడయి బ్రతుకు సాగిస్తుంటాడు కొంత కాలం. అది కూడా తీరిపోతే చివరకు దేహ పాతానంతరం విముక్తః ముక్తుడయి మాముపైష్యసి. నాతో సాయుజ్యం పూర్తిగా పొందుతాడని భగవానుడిచ్చే హామీ. ఇక్కడ మోక్ష్యసే విముక్తః

Page 247

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు