#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము



యే ప్యన్య దేవతా భక్తా య జంతే శ్రద్ధయా న్వితాః
తేపి మా మేవ కౌంతేయ - యజం త్యవిధి పూర్వకమ్- 23


  అయితే ఇప్పుడొక చిక్కు వచ్చి పడింది. అన్య అన్నారు. అనన్య అన్నారు. ఎవరి కన్యం. ఎవరు అన్యం. పరమాత్మకేనా. పరమాత్మ కంతా అనన్యమే గదా. అసలున్నది కూడా పరమాత్మే గదా. పరమాత్మకు భిన్నంగా మరి ఏదీ లేదని గదా అద్వైత సిద్ధాంతం. అప్పటికీ దేవతలెవరూ. దేవలోకాలేమిటి. మానవులెవరు. వారి కోసం చేసే యజ్ఞాది కర్మలేమిటి. వీరక్కడికీ ఇక్కడికీ చేసే సంచారమేమిటి. జన్మలేమిటి. జన్మాంతరా లేమిటి. అంతా పరమాత్మే. పరమాత్మ కనన్యమే గదా. అలాంటప్పుడిక ఈ మానవులు దేవతల నారాధిస్తే మాత్రం తప్పేమిటట.

  వాస్తవమే - పరమాత్మే ఉన్న పదార్థం. మరేదీ లేదు దానికి విజాతీయమైన పదార్ధమనేది. దేవతలు కూడా పరమాత్మే వాస్తవానికి. వారిని పూజించినా పరమాత్మను పూజించినట్టే. అంతా బాగానే ఉంది. కాని ఒక్క తిరకాసుంది ఇందులో. వస్తుసిద్ధంగా ఇదంతా పరమాత్మే అయినా దానికన్యంగా ఏదీ లేకపోయినా అలా చూడటం లేదు మానవులు. వస్తుసిద్ధమైనా బుద్ధి సిద్ధం కావటం లేదు. పరమాత్మేనని తెలుసుకోలేక దాన్నే దేవతలుగా దేవలోకాలుగా యజ్ఞయాగాదులుగా భావిస్తున్నారు. ఇది ఎలాంటిదంటే అది బంగారమని గుర్తించక దాన్నే కమ్మలని కాసుల దండలని ఒడ్డాణమని గాజులని చూచినట్టు. ఆయా ఆభరణాలుగా చూచినా అది బంగారమేనా కాదా. బంగారాన్నే సొమ్ములుగా చూస్తున్నాము.

Page 238

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు