#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  అయితే మరి అదే లోకంగా ఉండే వారికింకా ఈ శరీరమనే ఉపాధి ఒకటుంది గదా. దీని కాకలి దప్పులు తప్పవు గదా. రోగాలూ రొష్టులూ కూడా వెంటపడు తుంటాయి గదా. అప్పుడైనా అన్యచింత ఉండక పోదు గదా. ఏమిటి దానికి జవాబంటే అది కూడా చెబుతున్నాడు. యోగక్షేమం వహామ్యహం. ఇదీ జవాబు. వారి యోగక్షేమాలు నేనే చూస్తానని హామీ ఇస్తున్నాడు. యోగమంటే కావలసిన వన్నీ సమకూరటం. క్షేమమంటే అలా సమకూరిన దంతా అలాగే ఉండిపోవటం. ఇంతకన్నా కోరదగిన దేమిటి జీవితానికి. ఇది వారికి పరమాత్మే చూస్తాడంటే ఏమిటర్ధం. అది వారి ప్రారబ్ధం కొద్దీ ప్రాప్తించి తీరుతుంది. వ్రాయకపోతే రాదు. వ్రాసిపెడితే రాకపోదు. ఇంకేమిటి భయం. భయం వాటి కోస మాందోళన పడినప్పుడే. అది నిరంతరాత్మ చింతనలో ఎప్పుడో కరిగిపోయింది. ఇక వస్తుందా పోయిందా అనే చింతేమిటి. చింత ఉంటే అది మరలా అన్యమే. ద్వంద్వమే. కనుక ప్రారబ్ధానికి వదిలేస్తాడు జీవితం. పర్యుపాసన కప్పగిస్తాడు తన భావన అంతా ఆత్మజ్ఞాని. ఇదీ ఒప్పందం. ఇక్కడ మరొక అర్థం కూడా చెప్పవచ్చు యోగక్షేమాలకు. అనన్య బుద్ధితో బ్రతికే సాధకుడికాత్మ జ్ఞానం లభించటం యోగమైతే అది ఎప్పుడూ తొలగిపోకుండా నిలబడటమే క్షేమం జ్ఞానం - జ్ఞాననిష్ఠా - ఇదే వాడి జీవితం. ఇంకా ఒక విశేషముంది మనం గ్రహించవలసింది. ఈ శ్లోకంలో పూర్వార్ధం వరకూ మానవుడి ప్రయత్నమైతే ఉత్తరార్ధం ఈశ్వరానుగ్రహం. వీడి డ్యూటీ ఇదైతే వాడి డ్యూటీ అదీ. ఇదీ ఒప్పందమే ఇద్దరికీ.

Page 237

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు