దీనికంతటికీ కారణం మనమా భగవత్తత్త్వాన్ని అనన్యంగా భావించక పోవటమే. అనన్యమంటే ఎవరి కనన్యం. మనకూ ఈ ప్రపంచానికీ కూడా. పరమాత్మ మనబోటి జీవులకూ అన్యంగా లేడు. ఈ జగత్తుకూ అన్యంగా లేడు. జగత్తు కంటే ఇహమే గాదు. పరం కూడా. జీవులంటే మనమే గాదు. బ్రహ్మాది దేవతలు కూడా. చేతనా చేతనాలు రెండూ వాస్తవంలో ఆ భగవత్తత్త్వాని కన్యంగా లేవు. వీటికా తత్త్వ మన్యంగా లేదు. అయినా అవిద్యావశాత్తూ అన్యంగా చూస్తున్నారు నూటికి నూట ఒక్కమంది. అందుకే అనన్యమైన ఆ భగవత్తత్వం సదసత్తులుగా విభక్తమయి కనిపిస్తున్నది. అమృతమూ మృతమూ నని ద్వంద్వంగా భాసిస్తున్నది. రెండూ విశేషాలే కాబట్టి ఒకటి అనుభవిస్తే ఒకటి లేదు. జీవితముంటే మరణం లేదు. మరణముంటే జీవితం లేదు. ఒక అనుభవ మున్నప్పుడుంటుంది. లేనప్పుడు లేదు. ఏదీ అవిచ్ఛిన్నంగా అనుభవానికి రాకుండా పోతున్నది. ఇహమూ నిత్యంగా అనుభవంలో లేదు. పరమూ నిత్యానుభవంలో లేదు. ఏకమైన ఆత్మతత్త్వాన్ని సదసత్తులనే ద్వంద్వంగా చూడటం వల్ల కలుగుతున్న ముప్పిది. అలా చూచేసరి కనన్యమైన తత్త్వం సదసత్తు లనే అన్యంగా కనిపించి అదే వాస్తవమై మనలను వెంటాడుతున్నది. శాస్త్రజ్ఞులకూ తప్పటం లేది. అశాస్త్రజ్ఞులకూ తప్పటం లేదు. ఇదే సంసార బంధం.
అయితే మరి ఎలా చూస్తే సరిపోతుం దంటారు. అన్యంగా చూడటం సమస్య అని ఎప్పుడన్నామో అనన్యంగా చూడటమే దానికి పరిష్కారం. పైగా మనం చూస్తేనే గాదు. చూచినా చూడకపోయినా అసలది అనన్యమే.
Page 235