#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

సంతోషించే సోమయాజులు. యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్ధయంతే. జ్యోతిష్టోమాది యాగాలు చేసి వీరు స్వర్గాది భోగాలకు పరుగులు పారుతుంటారు. తే పుణ్య మా సాద్య సురేంద్ర లోకం. చచ్చి సున్నమై ఆ దేవ లోకాలు చేరుకొంటారు. అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. చేరి అక్కడ దేవభోగాలన్నీ అనుభవిస్తారే అనుకొండి. అనుభవిస్తే ఏమట. అక్కడే కలకాలమూ ఉండగలరా. చస్తే ఉండలేరు. క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి. ప్రోగు చేసుకొన్న ఆ పుణ్యం కాస్తా ఖర్చయి పోగానే మళ్లీ వచ్చి ఈ మర్త్య లోకంలో జన్మించక తప్పదు. ఈ ఉపద్రవాని కంతటికీ ఏమిటి కారణం. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః - త్రయీ అంటే ఋగ్యజుస్సామ వేదాలు. అవి చెప్పినదే సత్యమని గుడ్డిగా నమ్మటం వల్ల వచ్చిన ప్రమాదం. ఏకమైన పరమాత్మ తత్త్వాన్ని స్వర్గాదులైన అనేక రూపాలుగా చూపుతున్నదది. అది ఎందుకని చూపిందలా. గతా గతం కామ కామా లభంతే. దాని తప్పు గాదది. స్వర్గాది భోగాలెక్కడో ఉన్నాయి. అవి కొట్టేద్దామనే పిచ్చి పిచ్చి కోరికలు మనం పెట్టుకోటమే తప్పు. మన కోరికలను బట్టి వేదమదే మనకు బోధిస్తున్నది. అనాత్మ కావాలని కోరితే అనాత్మ భావాలే చెబుతుందది. అప్పుడు గతాగతం లభంతే. అప్పుడక్కడికీ ఇక్కడికీ రాకపోకలు చేయలేక చస్తాం. జనన మరణాల పాలయి పోతుంటాం. గతీ మోక్షం లేదు మనకు. పండితులైనా అంతే పామరులైనా అంతే.

అనన్యాశ్చింతయంతో మాం- యే జనాః పర్యుపాసతే తేషాం
నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ - 22

Page 234

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు