పితామహుడూ - వీరందరూ కూడా ఎక్కడో లేరు. వారినీ నీవు వేరుగా చూడక్కర లేదు. వారూ ఆ పరమాత్మ విభూతి శకలాలే. అసలా పరమాత్మే నీకు హితైషి - శరణ్యం. ఈ ప్రపంచ సృష్టి స్థితిలయాలన్నీ ఆయనకు వేరుగా ఎక్కడా లేవు. నీవు చేసే యజ్ఞాది క్రియలన్నీ ఇలా చేయాలలా చేయాలని నీకు బోధించే వేద వేదాంగాదులు కూడా ఆయనకు వేరుగా ఎక్కడా లేవు. మరి ఈ సూర్యుడెండ కాస్తున్నాడంటే వరుణుడు వర్షం కురిపిస్తున్నాడంటే అగ్ని మండుతున్నాడంటే వారు కారా పనులు చేయటం. వారి రూపంలో పరమాత్మే. అసలు బంధం మోక్షం కూడా పరమాత్మ స్వరూపమే. కాబట్టి సంసార బంధం తప్పించుకొని బయటపడాలంటే దానికే దేవతలనో పట్టుకొంటే మోక్షం ప్రసాదిస్తారని భావించటం కూడా అవివేకమే సుమా. వివేకవంతుడవే అయితే వారిని పట్టుకొని వారిచ్చే స్వర్గాది సుఖాల కోసం గాదు నీవు తాపత్రయ పడవలసింది. ఆయా యజ్ఞయాగాది కర్మలు చేయవలసింది. అదంతా ఎవరి స్వరూపమో అలాటి మూలభూతమైన నన్ను పట్టుకో. నీవు మోక్షసామ్రాజ్యానికే పట్టాభిషిక్తుడ వవుతావని మనలను హెచ్చరించటానికే ఇంతవరకూ జరిగిన ఈ వర్ణన అంతా. అదే దీని కంతటికీ తాత్పర్యం. మరి మేమంత హితబోధ చేసినా అసలైన భగవత్స్వరూపాన్ని గుర్తించ లేకదాని ఆభాస అయిన ఈ అనాత్మ రూపాల కోసమే ప్రాకులాడే అవివేకులా మీరు. అయితే వినండి. మీ ఆలోచనలకూ ఆచరణకూ తగిన ఫలమే గాని అంతకన్నా గొప్ప ఫలం మీకు లభించదు.
Page 230