#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

అసలైన తత్త్వమని చెప్పాము. అసలైన తత్త్వాన్ని చూడటమే జ్ఞానం. అపరాన్ని పట్టుకొంటే అది జ్ఞానం కాదు. జ్ఞాన మనే పేరుతో చెలామణి అయ్యే అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడిపోయిన వారే మీమాంసకుల దగ్గరి నుంచి పామర జనం వరకూ. కనుకనే వారిది మోఘమైన జీవితమని చీవాట్లు పెట్టాడు పరమాత్మ. వీరలా కాక పరమార్ధ జ్ఞాన సంపన్నులు. కాబట్టి మోఘం కాదు. వీరి దమోఘమైన జీవితం. అందుకే మహాత్మానస్తు. వీరిని మహాత్ములని కీర్తిస్తున్నది భగవద్గీత. ఇంతకు ముందుకు కూడా వచ్చిందీ మాట సమహాత్మా సుదుర్లభః అని. ఆత్మనే పట్టుకొన్న వారని పదార్థం. గొప్ప ఆత్మ పరమాత్మ. అదే నా స్వరూపమీ జీవాత్మ కాదని భావించినవాడు కాబట్టి వాడు మహాత్ముడు. అలాటివాడు నూటికి కోటి కొకడే ఉంటాడు. అందుకే దుర్లభుడు వాడు. అపరాన్ని చూడడు వాడు. పరాన్నే చూస్తాడు. పరాన్ని చూస్తే పరమూ అర్థ మవుతుంది. అపరమూ బోధ పడుతుంది. అపరాన్ని మాత్రమే అయితే పరం బోధపడదు. అపరం బోధపడ్డా ప్రయోజనం లేదు. అది ఆభాస. అంచేత ఎవరో ఉంటారు మహాత్ము లైనవారు లోకంలో అపురూపంగా.

  మహాత్ములయి నందు కేమిటి నిదర్శనం. మాం భజం త్యనన్య మనసః అనన్య మనస్కులై నన్ను భజిస్తా రంటాడు భగవానుడు. పరమాత్మను వారు తమ కనన్యమని భావిస్తారు. తమ స్వరూపంగానే దర్శిస్తారు. మిగతా తొంభయి తొమ్మిది మంది వారు కర్మిష్ఠులే కావచ్చు. ఉపాసకులే కావచ్చు. యోగులే కావచ్చు. భక్తులే కావచ్చు. అలా భజించరు.

Page 220

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు