#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

బాహ్యాభ్యంతారాలు రెండూ కలిసి వచ్చాయి. అంటే ఏమన్న మాట. జీవజగత్తులు రెండూ వీటిలోనే ఇమిడిపోయాయి. ఇయం మే భిన్నా ప్రకృతి రష్టధా. అష్టమూర్తులుగా విభక్తమయి కనిపించే ఈ సమస్తమూ ఏదో గాదు. నా ప్రకృతే నంటాడు పరమాత్మ. ప్రకృతి అంటే స్వభావం Nature. పరమాత్మ స్వభావమిది. ఎలాటి స్వభావమట. అపరేయం - అపరమైనది. అంటే తగ్గు జాతిది. Inferior. నికృష్టమన్నారు భగవత్పాదులు. నికృష్టమెలా అయింది. సంసార బంధంలో మనలను పడదోస్తుంది గనుక అని హేతువు చెప్పారాయన. ఇందులో ఇంకొక సూక్ష్మం కూడా ఉంది మనం గ్రహించ వలసింది. పృథివ్యాది పంచభూతాలూ స్థూలమైన భూతాలు కావిక్కడ. వాటి తన్మాత్రలు. భూత సూక్ష్మా లంటారు వాటిని. శబ్ద స్పర్శాదులు. ప్రకృతి రష్టధా అని చెప్పటం మూలాన దాని సూక్ష్మ రూపాన్నే గ్రహించాలి. స్థూలరూపాన్ని కాదు. స్థూలమైతే అది వికృతి. ప్రకృతి కాదు. పోతే ఇక మనోబుద్ధ్యహంకారాలు. అహంకార మహ దవ్యక్తాలే. వీటిని సూక్ష్మ రూపాలకు సంకేతాలుగా గ్రహించాలంటారు భగవత్పాదులు.

  ఇలా ఎనిమిది విధాలుగా విభక్తమైన ఈ ప్రకృతి ఏదోగాదు. నాదే నా శక్తేనంటాడు పరమాత్మ. ఇక్కడ ప్రకృతి అనేమాట జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి భావుకుడు. ఇది సాంఖ్యులూ యోగులూ చెప్పే ప్రకృతి గాదు. వారు చెప్పే ప్రకృతికి ప్రధానమని పేరు. అది స్వతంత్రమని చెబుతారు వారు. సాంఖ్యులకైతే ఈశ్వరుడే లేడు. కనుక అది ఎవరిమీదా ఆధారపడదా ప్రకృతి. మంచీ చెడ్డా అనే తేడా లేకుండా ఏ పని అయినా

Page 22

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు