పెట్టుకొనే అగ్నిహోత్రాది వైదిక కర్మలన్నీ ఆచరిస్తుంటారు. మోఘ కర్మాణః అవి కూడా పనికిమాలిన పను లేనంటున్నది గీత. ఎందుకంటే భగవత్పరి భవాత్ స్వాత్మ భూతస్య అవజ్ఞానాత్తని వ్రాస్తున్నారు భగవత్పాదులు. ఆ భగవాను డెవరో గాదు తమ స్వరూపమే ననే సత్యం మరచిపోయి అగ్ని వరుణాది దేవతలుగా తమ కన్యంగా భావించి వారిచ్చే స్వర్గ సుఖాదులు వాస్తవమని పిచ్చిగా యజ్ఞయాగాదులు చేస్తున్నారు. సర్వవ్యాపకమూ తమ కాత్మ భూతమూ ఐన భగవత్తత్త్వాన్ని చిన్నచూపు చూస్తున్నారు. తధా మోఘ జ్ఞానాః ఇలాటి అల్పమైన జ్ఞానంతో ఏ కర్మ ఆచరించినా అది మోఘమే నిష్ఫలమే. అసలా జ్ఞానమూ నిరర్ధకమే. విచేతసః చేతస్సంటే వివేకం. ఏది మంచో ఏది చెడో తెలిసి చేయటం. అలాటి వివేకం లేకుంటే అది అవివేకంగాక మరేమిటి.
దీనికంతా మూల కారణమొక్కటే. రాక్షసీ మా సురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ఆసురమూ రాక్షసమూ అయిన ప్రకృతి ఏదుందో దాన్ని పట్టుకొని బ్రతుకుతున్నారు వీరంతా. ఏమిటా ప్రకృతి. అదే గదా ముందునుంచీ చెబుతూ వచ్చాము అవిద్యా లక్షణ అని. విద్యాలక్షణ సాత్త్వికి. అది లేదు వీరికి. అది ఉంటే భగవత్తత్త్వ మసలు ఏమిటో ఆ పరతత్త్వాన్నే చూపేది వీరికి. దానికి నోచుకోలేదు వీరు. దానికి మారుగా అవిద్యారూపిణి అయిన రాజస తామస ప్రకృతితో సతమత మవుతున్నారు. మరి దానికి తగినట్టే వీరి ఆలోచనలూ మాటలూ - చేష్టలూ. పరతత్త్వ మెలా గోచరిస్తుంది వీరికి. దాని స్థానంలో వీరికి కనిపించేది అపర తత్త్వమే.
Page 218