#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

సర్వభూతాని కౌంతేయ - ప్రకృతిం యాంతి మామికాం
కల్పక్షయే - పునస్తాని- కల్పాదౌ విసృజామ్యహమ్ - 7

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః
భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ - 8


  ఈ రెండు శ్లోకాలూ ఇంతకుముందు అక్షర పరబ్రహ్మ యోగమనే ఎనిమిదవ అధ్యాయంలో చెప్పుకొన్న రెండు శ్లోకాలకు సరిదీటుగా నడుస్తున్నాయి. అవ్యక్తాద్వ్యక్తయ స్సర్వాః అని ఒకటి - భూత గ్రామస్స ఏవాయమని మరొకటి రెండు శ్లోకాలింతకు ముందక్కడ వచ్చి ఉన్నాయి. వాటికివి ప్రతిధ్వని రూపాలా అని తోస్తుంది చూడగానే. కాని ఎంత సాదృశ్యముందో వాటితో వీటికి అంత విశేషం కూడా ఉంది బాగా పరిశీలించి చూస్తే. అక్కడ బ్రహ్మ దేవుడు - ఆయన నిద్రావస్థ జగత్తుకు ప్రళయమని జాగ్రదవస్థ దాని సృష్టి అనీ వర్ణించబడింది. అవ్యక్తమంటే బ్రహ్మ స్వాపావస్థ Sleep అనే వ్రాశారు భాష్యకారులు కూడా. అది కొంచెం తికమకగా ఉంది పాఠకులకు. బ్రహ్మదేవు డేమిటి నిద్ర ఏమిటి. ఆయనకు మెలకువ ఏమిటి. నిద్రలో ఇది లయమయి పోవట మేమిటి. మెలకువ వచ్చి ఆయన మరలా సృష్టి చేయట మేమిటి. అలా చేస్తే కర్తృత్వ మాయనదే గదా. కర్తృత్వముంటే ఆయనదే గదా భోక్తృత్వం కూడా. అప్పుడిక జీవుడి దేముంది బాధ్యత. వీడికి బాధ్యత లేకపోగా నిరంకుశంగా చేసినందుకు బ్రహ్మకే గదా అప్రతిష్ఠ. అంతేకాక అటు బ్రహ్మమూ గాక ఇటు జీవుడూ గాక మధ్యలో ఈ బ్రహ్మ దేవుడెవడు. వాడి కెవడిచ్చాడు జీవులను వేధించే అధికారం. అని ఇలా ఎన్నో ప్రశ్న లెదురవుతాయి మనకు.

Page 203

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు