#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

చిదాకాశరూపుడైన పరమాత్మలోనే ఉన్నదీ అనాత్మ ప్రపంచమంతా. అది అనంత మయినట్టే ఇదీ అనంతం. అది కూటస్థమూ అచలమూ అయినట్టే ఇదీ అచలం. దాని ఎల్లలు దాటి వాయువెలా పోలేదో ఈ చిదాకాశపు టెల్లలు దాటి ఏ చరాచర జగత్తూ పోలేదు. అది వాయమండలాని కాధారమయినట్టే ఇది అనాత్మ ప్రపంచానికంతా ఆధారం. అందులో వాయువే గాని వాయువులో అది లేనట్టే ఈ చిదాకాశంలోనే జగత్తుగాని జగత్తులో అది లేదు. ఆకాశమే అక్కడ చలించి వాయు వయినట్టే చిదాకాశమే చలించి ఈ ప్రపంచమనే రూపంలో కనిపిస్తున్నది. చలిస్తున్నా ఈ వాయుమండల మాకాశం కన్నా అన్యంగా లేనట్టే గతిశీలమైన ఈ ప్రపంచమంతా పరమాత్మ కన్నా అన్యంగా లేదెక్కడా.

  ఇప్పుడీ దృష్టాంతం మనమింతకు ముందు పేర్కొన్న మూడు భూమికలకూ అద్భుతంగా సరిపోతున్నది. నాలో ఈ సమస్తమూ ఉంది. వాటిలో మాత్రం నేను లేను. ఆ మాటకు వస్తే నాలో కూడా అవి లేవని గదా ఇంతకు పూర్వం వర్ణించాడు భగవానుడు. అవి మూడూ ఈ దృష్టాంతాన్ని విమర్శించి చూస్తే తెలిసిపోతాయి మనకు. ఎలాగంటే ఆకాశంలోనే వాయువుందనేది మొదటి మాట. వాయువులో ఆకాశం లేదనేది రెండవమాట. పోతే వాయువు కూడా ఆకాశం కన్నా వేరుగా లేదు. ఆకాశమే కదిలితే దాన్ని వాయువన్నా మనేది మూడవ మాట. అలాగే ఆత్మలోనే అనాత్మ ప్రపంచమంతా ఉంది. అనాత్మలో మాత్ర మాత్మ లేదు. అసలనాత్మ అనేది ఆత్మకంటే వేరుగాదు. ఆత్మే అనాత్మగా భాసిస్తున్నదని దీన్నిబట్టి చక్కగా అర్ధం చేసుకోవచ్చు భావుకుడు.

Page 202

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు